‘మిరాయ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఇప్పుడు హీరోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మనోజ్ హీరోగా రూపొందుతున్న ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ ఈరోజు బయటకు వచ్చింది. కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపించాయి. ఈ సినిమాలో రామ్ చరణ్, శింబు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారన్న ఓ వార్త సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్త నిజమేనా అనే ప్రశ్న మనోజ్ కి ఎదురైంది. దానికి మనోజ్ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకొన్నారు. రామ్ చరణ్ ని ఇప్పటి వరకూ సంప్రదించలేదని చెబుతూనే, ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన పాత్రలు ఉన్నాయని, వాటిలో కొంతమంది కనిపించే ఛాన్సుందని, ఇప్పటికి గ్లింప్స్ మాత్రమే వచ్చింది కాబట్టి, తదుపరి విషయాలు మాట్లాడుకోవడానికి ఇంకా టైమ్ ఉందని… సమాధానం దాటవేశారు. అంటే చరణ్, శింబు పాత్రలకు ఈ కథలో చోటు ఉన్నట్టే. కానీ వాళ్లిద్దరూ నటిస్తారా, లేదా? అనేదే అసలు ప్రశ్న.
శింబు – మనోజ్ ఇద్దరూ మంచి మిత్రులు. మనోజ్ అడిగితే…. శింబు కాదనడు. రామ్ చరణ్కీ, మనోజ్ కీ చక్కటి అనుబంధం వుంది. చరణ్ కూడా తన వాళ్లకు సాయం చేయడానికి ముందుంటాడు. సో… చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వీరిద్దరూ ఈ సినిమాలో ఉన్నారా, లేదా? అనే విషయంలో ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదు. ఈసినిమా ఇటీవలే పట్టాక్కింది. రిలీజ్కు ఇంకా చాలా కాలం ఉంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు. నిజంగానే చరణ్, శింబు ఈ సినిమాలో కనిపిస్తే మనోజ్ సినిమాకు అది గట్టి బూస్టప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.