మంగళగిరి నియోజకవర్గ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చొరవతో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మొత్తం 128 జట్లు తలపడిన ఈ మెగా టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వల్లభనేని వెంకట్రావు టీమ్ , సీకే వారియర్స్ జట్లు ఫైనల్‌కు చేరాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బోగి ఎస్టేట్స్‌లోని క్రీడా ప్రాంగణంలో ఈ తుది సమరం జరగనుంది. యువతకు క్రీడల పట్ల మక్కువ పెంచాలన్న మంత్రి లోకేష్ ఆలోచనకు అనుగుణంగా, పాల్గొన్న అన్ని జట్లకు ఆయన సహకారంతో క్రికెట్ కిట్లను పంపిణీ చేయనున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు , ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. విజేతలకు భారీ నగదు బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతిగా రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. వీటితో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న క్రీడాకారుడికి ఎలక్ట్రిక్ బైక్, ఉత్తమ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు నగదు బహుమతులతో పాటు సైకిళ్లను బహూకరించనున్నారు. ఈ భారీ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే అద్భుతంగా పూర్తి చేశారు.
మంత్రి నారా లోకేష్ క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే మంగళగిరిలో ఇలాంటి ప్రతిష్టాత్మక లీగ్ విజయవంతంగా జరుగుతోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు టాస్ గెలిచిన వారికి సిల్వర్ కాయిన్స్, ఫైనల్ టాస్ విజేతకు గోల్డ్ కాయిన్ వంటి వినూత్న బహుమతులను కూడా ఏర్పాటు చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో క్రికెట్ ప్రేమికులంతా ఈ ఫైనల్ ఫైట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

