`మాంఝీ’ చూసిన`మాంఝీ’

కొండను పిండిచేసే ప్రేమ అతనిది. బండరాళ్లను పిండిచేసే సాహసం అతనిది. తనకొచ్చిన కష్టం ఇతరులకు రాకూడదన్న సామాజిక స్పృహ అతనిది. బిహార్ లోని ఒక గ్రామస్థుడి సంకల్ప కథ ఇప్పుడు వెండితెరమీద ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. `మాంఝీ- ది మౌంటేన్ మ్యాన్’ పేరిట విడుదలైన హిందీచిత్రం ఇప్పుడు అనేకమందిలో ఆలోచనలను రేపుతోంది.

మాంఝీ పూర్తి పేరు దశరథ్ మాంఝీ. ఈ చిత్రకథ హీరో అతనే. అతను ఇప్పుడు మనమధ్యలేకపోయినా, ఆ పాత్రను సినిమాలో పోషించిన నవాజుద్దీన్ సిద్ధిఖి లో మాంఝీ అందరికీ కనిపిస్తూనేఉన్నాడు. బిహార్ లోని గయా జిల్లాలోని ఒక సినిమా హాలుకు వెళ్ళి మాంఝీ కుటుంబసభ్యులు ఎంతో ఆనందంగా మూవీ చూడటం మరో విశేషం.

బిహార్ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేసింది. ఓ మంచి సినిమాను రాష్ట్రంలోని ప్రజలంతా చూడాలన్న లక్ష్యంతో పన్ను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.

దశరథ్ మాంఝీ కుమారుడు భగీరథ్ మాంఝీ సినిమా చూశాక చాలా సంతోషం వ్యక్తంచేశాడు. `నాన్న జీవితాన్ని ఇలా తెరమీద చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వచ్చే జనరేషన్ వాళ్లకు ఈ కథ స్ఫూర్తిదాయకం కావాలి. నిర్ణీత లక్ష్యంతో నిస్వార్థంగా కష్టపడివిజయం సాధించడం ఎలాగో తెలుసుకోవడానికి ఈ సినిమా దోహదపడతుంది’ అని అన్నారు. మాంఝీ మనవడు మిథున్ మాంఝీ ఈ సినిమాచూసి చాలా సంబరపడిపోయాడు. `తాతగారి కథ సినిమా రీళ్లుగా నడుస్తుంటే ఓ అద్భుతం చూస్తున్నట్టు ఫీలయ్యాను’ అంటూ భావోద్వేగాలకు లోనయ్యాడు.

బిహార్ రాష్ట్రంలో లక్షలాది మంది ఈ సినిమా చూడటం ఒకఎత్తైతే, మాంఝీ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి గయాలోని ఓ థియేటర్ లో సినిమా ప్రదర్శించడం మరో ఎత్తు. ఇది ఇలాఉంటే, నాలుగురోజుల కిందటనే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సినిమాని ప్రత్యకంగా వేయించుకుని చూశారు. చిత్రదర్శకుడు కేతన్ మెహతాను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. కాగా, సినిమా విడుదలైన రోజునే మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా ఈ సినిమాని తనపార్టీ నేతలతో కూర్చుని చూశారు. మాంఝీ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని జితన్ రామ్ కోరారు.

22ఏళ్లు కష్టపడి కొండను తొలిచి రహదారి ఏర్పాటు చేసిన సాహసి మాంఝీ. ఆయన 80వ ఏట కన్నుమూశారు. మాంఝీ జీవితంలోని యదార్థ సంఘటనల ఆధారంగా కేతన్ మెహతా `మాంఝీ ద మౌంటెన్ మ్యాన్’ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 21 (శుక్రవారం) విడుదలైంది. బిహార్ లోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మాంఝీ కొండతోనే సవాల్ చేసి, దాన్ని కరిగించి దారి ఏర్పాటుచేయడం ఓ సాహసగాధ. ఈ గ్రామం నుంచి పట్టణానికి వెళ్లాలంటే కొండ తిరిగి వెళ్ళాల్సిందే. ప్రమాదంలో చిక్కుకున్న తన భార్యను అలా చుట్టుతిరిగి తీసుకువెళ్లేలోగానే కన్నుమూసింది. అప్పటి నుంచీ అడ్డుగా ఉన్న కొండను తొలవాలని మాంఝీ నిర్ణయించుకున్నాడు. సుత్తి, ఉలి వంటి సాధారణ పరికరాలను తీసుకుని కొండ ఎదుట నిలిచి దాన్ని పిండిచేస్తానంటూ సవాల్ విసురుతాడు. అప్పటి నుంచీ 22ఏళ్లు కష్టపడి అనుకున్నది సాధిస్తాడు. సంకల్పసిద్ధి కోసం ఎన్నో ఇబ్బందులు పడతాడు. మాంఝీ పాత్రని నవాజ్ పోషించాడు. మాంఝీ భార్యగా రాధికా ఆప్టే పోషించింది. వీరి మధ్య ప్రేమకథని హృదయానికి హద్దుకునేలా చిత్రీకరించాడు దర్శకుడు.

మాంఝీకి ఎదురుగా ఉన్న కొండే అడ్డు. అలాగే, మన జీవితాల్లో అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎదురునిల్చి పోరాడితే అంతిమ విజయం మనదే అన్న స్ఫూర్తి ఈ సినిమా అందిస్తోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com