ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకు?అని అనుకొంటాము. కానీ అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడనే సంగతి యావత్ ప్రపంచానికీ తెలిసినప్పటికీ దానిని అద్దంలో చూపించినట్లుగా ఆధారాలతో చూపిస్తేగానీ అది శాస్త్ర సమ్మతం కాబోదు. అందుకే శంఖంలో పోస్తేనే నీళ్ళు తీర్ధం అవుతాయనే మరొక నానుడి కూడా ఉంది. అతను ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలుగా అతని కోసం ప్రపంచదేశాలు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసాయి. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడనే సంగతి అన్ని దేశాలకు స్పష్టంగా తెలుసు. కానీ ఎవరూ పట్టుకొనే సాహసం చేయలేకపోవడం చూస్తే అతను ప్రపంచ దేశాల కంటే చాలా శక్తివంతుడనుకోవాలి లేకపోతే ప్రంచదేశాల చేతగానితనమని సరిపెట్టుకోవలసి ఉంటుంది.
1993 ముంబై ప్రేలుళ్ళలో ప్రధాన సూత్రధారిఅయిన అతను పాకిస్తాన్ లోనే తలదాచుకొన్నాడు కనుక అతనిని తమకు అప్పగించమని భారత్ కోరిన ప్రతీసారి పాకిస్తాన్ అతను తమ దేశంలో ఎక్కడా లేడని బుకాయిస్తోంది. ఇదివరకు లష్కర్-ఏ-తోయిబా అధినేత బిన్ లాడెన్ విషయంలోను పాక్ చివరి వరకు ఇలాగే బుకాయించింది. కానీ చివరికి అతను పాక్ భూభాగంలోనే పాక్ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నడనే విషయం అమెరికా కమెండోలు అతనిపై దాడి చేసి మట్టుబెట్టిన తరువాత ప్రపంచానికి తెలిసివచ్చింది. అదే విధంగా భారత్ పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులందరూ పాక్ లోనే శిక్షణ పొందుతున్నారని కొన్ని రోజుల క్రితం ఉదంపూర్ లో పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ పట్టుబడినప్పుడు మరోమారు స్పష్టమయింది.
దావూద్ ఇబ్రహీం పాక్ లో ఖచ్చితంగా ఎక్కడ నివాసం ఉంటున్నాడో తెలిపే బలమయిన ఆధారాలను భారత్ నిఘా వర్గాలు సంపాదించాయి. అతను తన కుటుంబంతో సహా కరాచీలోని క్లిఫ్టాన్ రోడ్డులో నివాసం ఉంటున్నట్లు భారత్ నిఘావర్గాలు కనుగొన్నాయి. అతని భార్యా పిల్లల వివరాలు, అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియజేసేందుకు అతని భార్య పేరిట ఉన్న ఫోన్ బిల్లు, అతని ఫోటో ఉన్న గుర్తింపు కార్డు, అడ్రస్ వగైరా అన్నీ భారత్ నిఘా వర్గాల చేతికి చిక్కాయి.
కానీ అంత మాత్రాన్న పాకిస్తాన్ అతనిని తెచ్చి భారత్ చేతికి అప్పగించేస్తుందని ఆశ పడితే అది అత్యాశే అవుతుంది. అతను ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడ ఉంటున్నాడో భారత్ కి ఖచ్చితంగా తెలుసు కనుక అమెరికాలాగ అతని ఇంటి మీదకి భారత్ కమెండోలని పంపించి పట్టుకోవడం సాధ్యం కాదు. కనుక అతని పేరిట రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది కనుక ఆ వివరాలను ఐక్యరాజ్యసమితి చేతిలో పెట్టి అతనిని పట్టుకొని తమకు అప్పగించమని భారత్ కోరేందుకు ఉపయోగపడవచ్చును. కానీ ఐక్యరాజ్యసమితికయినా అతనిని పట్టుకొనే దైర్యం ఉంటే ఎప్పుడో పట్టుకొని ఉండేది. కనుక ఇప్పుడు భారత్ అతని అడ్రస్ కనుగొని చెప్పినంత మాత్రాన్న అతనిని అరెస్ట్ చేయడం ఎవరివల్లా కాదని భావించవచ్చును. ఒకవేళ అతని బుద్ధి బ్రష్టుపట్టి అమెరికా మీద దాడి చేసేందుకు కుట్ర పన్నితే మాత్రం అతనికీ బిన్ లాడెన్ కి పట్టిన గతే పట్టడం తధ్యం. అతను అటువంటి ఆలోచనలు చేయనంతవరకు అతనికి వచ్చే నష్టం, కష్టం ఏమీ ఉండకపోవచ్చును.