మ‌హేశ్‌కి వ్య‌తిరేకంగా కామెంట్స్ చేయ‌లేద‌ట‌!?

నవ్వడం ఒక భోగం…
నవ్వించడం ఒక యోగం…
నవ్వలేకపోవడం ఒక రోగం… మన పెద్దలు ఏనాడో చెప్పిన సామెత! నవ్వించడమనే యోగం కోసం వివిధ రకాలుగా ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలు శృతి మించితే ఎలా వుంటుందో? తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న చిరు నటుడు, స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్‌కు గట్టిగా అర్థమవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే… స్టాండప్ కామెడీలో భాగంగా నలుగుర్ని నవ్వించడం కోసం అకాడమ్మీ అని ఓ అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేస్తే మ‌హేశ్‌బాబును రాయితో పోల్చేశాడీ మనోజ్ ప్రభాకర్.

  • మ‌హేశ్‌ను రాక్‌స్టార్ అని ఎందుకు అంటారంటే… అత‌డి ముఖం రాయిలా వుంటుంది కాబ‌ట్టి!
  • మ‌హేశ్ మ‌గ క‌ట్రీనా కైఫ్‌లా వుంటాడు!
  • స్పైడ‌ర్‌లో విల‌న్‌గా న‌టించిన ఎస్‌జే సూర్య ఎక్స్‌ప్రెష‌న్లు ఇస్తుంటే.. మ‌హేశ్ రాయిలా వున్నాడు!

ఇవీ మ‌నోజ్ ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల్లో కొన్ని! తమిళనాట జరిగిన వెకిలి వినోద వేడుకలో అతడు చేసిన కామెడీకి వేదిక ముందున్న వాళ్లు కాసేపు నవ్వుకున్నారు. కాని మనోజ్ ప్రభాకర్ చేసిన తప్పేంటో? అదెంత సీరియస్ అంశమో? యూట్యూబ్‌కి వీడియో ఎక్కిన తరవాత తెలిసి వచ్చింది.

మహేశ్ అభిమానులు మాత్రమే కాదు… తెలుగు ప్రేక్షకులు, తమిళనాట మ‌హేశ్‌ని అభిమానించే ప్రేక్షకులంతా మనోజ్ ప్రభాకర్ మీద విరుచుకుపడ్డారు. నెట్టింట్లో ఓ ఆట ఆడుకుంటున్నారు. దాంతో మనోజ్ ప్రభాకర్ అందర్నీ క్షమించమని వేడుకున్నాడు. అయినా అభిమానులు ఆగలేదు. ఆగడం లేదు. అభిమానుల ఆగ్రహంలో ఓ అర్థం వుంది. తెలుగుతో పాటు భారతీయ ప్రేక్షకులల్లో మహేశ్‌కి వున్న గుర్తింపు ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి హీరో గురించి ముందూ వెనుకా ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసేయడమేంటి? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దాంతో మరోసారి మనోజ్ ప్రభాకర్ సారీ చెప్పాడు.

“తెలుగు సినిమా అభిమానులకు, మ‌హేశ్‌బాబుకు, మహేశ్ అభిమానులకు… ఇంతకు ముందు చెప్పినట్టు వ్యక్తిగతంగా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మహేశ్ అభిమానులకు గానీ.. అతడికి గానీ… నేను వ్యతిరేకం కాదు. నేను ఎవరినైనా బాధిస్తే.. ఎవరి మనోభావాలను అయినా హర్ట్ చేసి వుంటే… సారీ. కావాలని చేసినది కాదు. సిన్సియ‌ర్‌గా సారీ చెబుతున్నా. ఇక్కడితో అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా. (ట్రోలింగ్ ఆగుతుందని ఆశిస్తున్నా)” అని మనోజ్ ప్రభాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి అభిమానులు ఏమంటారో? తమిళ ప్రేక్షకులకు కూడా పెద్దగా తెలియని ఈ చోటా మోటా కమెడియన్ ఇప్పుడు ఏకంగా మూడు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు… సినిమా అభిమానులకు అతడు తెలిశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.