మావోయిస్టులు అడవుల్లో ఉంటే వెంటపడి కాల్చి చంపుతున్నారని మైదాన ప్రాంతాలకు మకాం మారుస్తున్నారు. వారిలో ఎక్కువ మంది చత్తీస్ ఘడ్ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడలోని ఆటోనగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో ముఫ్పై మందికిపైగా మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారు. వారందర్నీ గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారు ఏపీలో ఓ ప్రముఖ నాయకుడ్ని హత్య చేసి తమ ఉనికి బలంగా చాటాలని ప్లాన్ తో వచ్చారని అనుమానిస్తున్నారు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉదయం అల్లూరి జిల్లా అడవుల్లో ఎన్ కౌంటర్ కావడంతో.. వీరి గురించి సమాచారం బయటకు వచ్చింది. వెంటనే అందర్నీ పట్టుకున్నారు. ఒక్క విజయవాడలోనే కాదని.. ఏపీలో పలు చోట్ల వీరు షెల్టర్ తీసుకున్నట్లుగా గుర్తించారు. కాకినాడలోనూ ఇద్దర్ని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎక్కువ మంది మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సెక్యూరిటీగా పని చేస్తారు. మరి దేవ్ జీ ఎక్కడ ఉన్నారన్నది తేలాల్సి ఉంది. హిడ్మా ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు ఉన్న ఆశలన్నీ చెదిరిపోయినట్లే.
విజయవాడలో దొరికిన వారంతా మాడ్వీ హిడ్మా దళానికి చెందిన వారేనని.. ఏపీ ఇంటలిజెన్స్ చీప్ లడ్హా పగ్రకటించారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించి పారిపోయిన మావోయిస్టులను పట్టుకుంటామన్నారు. మార్చి 31లోపు మావోయిస్టుల్ని లేకుండా చేస్తామన్న అమిత్ షా .. ప్రతిజ్ఞ ప్రకారం.. అగ్రనేతలంతా ఎలిమినేట్ అవుతున్నారు. మిగిలిన వారు కూడా లొంగుబాటులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా.. విజయవాడకు వచ్చి వారు షెల్టర్ తీసుకోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వారికి అక్కడ ఎవరు ఆశ్రయం కల్పించారు… ఎవరు సహకరించారన్నది తేలాల్సి ఉంది.


