2025 క్లైమాక్స్‌లో ఉన్నాం. ఈ యేడాది జయాపజయాల జాబితా సిద్ధం అవుతోంది. ఈలోగా 2026 ప్రణాళికలు కూడా పటిష్టంగా తయారవుతున్నాయి. 2026 సంక్రాంతికి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేదానిపై ఓ స్పష్టత వచ్చేసింది. సంక్రాంతి తరవాత వేసవి సీజన్ చాలా కీలకం. ముఖ్యంగా మార్చి నుంచే హవా మొదలైపోతుంది. ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారకముందే సినిమాల్ని విడుదల చేయడం మంచిదన్నది నిర్మాతల ఉద్దేశ్యం. అందుకే మార్చి పై గట్టిగా గురి పెడుతున్నారు. 2026 మార్చిలో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈనెలని టార్గెట్ చేస్తూ టాలీవుడ్ లో చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి.
రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి ఆఖరి వారంలో తీసుకొద్దామనుకొంటున్నారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. సరిగ్గా అదే సమయానికి నాని ‘పారడైజ్’ని తీసుకొద్దానుకొంటున్నాడు. ఈ రెండు సినిమాలూ ఒక రోజు వ్యవధిలో రావాల్సివుంది. అయితే.. ‘పెద్ది’ రిలీజ్ ఖాయమైపోతే.. పారడైజ్ ఓ వారం వెనక్కి లేదా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాన్నీ మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తయ్యింది. కాబట్టి.. విడుదలకు ఎలాంటి ఢోకా లేనట్టే. ఈరోజు నుంచే ప్రమోషన్స్ కూడా మెల్లగా మొదలెడతారు. ఫస్ట్ సింగిల్ పలకరించడానికి సిద్ధంగానే వుంది.
మరోవైపు కన్నడ నుంచి ‘టాక్సిక్’ కూడా మార్చిలోనే విడుదల చేయాలని ఫిక్సయ్యారు. యష్ నటించిన సినిమా ఇది. తన నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ తెలుగులో ఎంతటి ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. మొత్తానికి మార్చిలో ప్రతీ వారం ఓ భారీ సినిమా పలకరించడం ఖాయం. ఏప్రిల్, మేలలో కూడా ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. రెండు మూడేళ్లుగా సమ్మర్ సీజన్‌ని టాలీవుడ్ సరిగా వాడుకోలేదు. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకపోవొచ్చు.
