మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో హైదర్ షా కోట్లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు మార్కింగ్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. దశాబ్ద కాలంగా ప్రశాంతంగా నివసిస్తున్న వందలాది కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి రావడంతో నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అపార్టుమెంట్ నదీగర్భంలో ఉందని మార్కింగ్ ఇచ్చారు. కానీ ఈ అపార్టుమెంట్ కు HMDA, GHMC నుండి అన్ని అనుమతులు వచ్చాయి. బ్యాంకు లోన్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా మూసీలో ఉందని చెబుతున్నారు.
తప్పు కొనుగోలు చేసిన వారిది కాదు..రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్లదే !
ఈ అపార్ట్మెంట్ నది గర్భంలోనే ఉంటే, అసలు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ప్రభుత్వ యంత్రాంగం అనుమతులు ఎలా మంజూరు చేసింది? సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వ పత్రాలనే నమ్ముతారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆ భూమిని రిజిస్టర్ చేసి, మున్సిపల్ శాఖ ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు అది చట్టబద్ధమైనదే అని ఎవరైనా భావిస్తారు. ఇప్పుడు ఏళ్ల తర్వాత అది ఆక్రమణ అని తేల్చడం అంటే, అప్పట్లో తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారుల వైఫల్యాన్ని సామాన్యుల మీద రుద్దడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పరిహారం ఇస్తారా ?
బాధితులను పరామర్శించిన రాజకీయ నేతలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, అమాయక కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క పన్నులు వసూలు చేస్తూ, మరోపక్క ఆ ఇళ్లకు మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామనడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని నివాసితులు ధ్వజమెత్తుతున్నారు. ఇది కేవలం ఒక అపార్ట్మెంట్ సమస్య కాదని, ప్రభుత్వ అనుమతులను నమ్మి ఇళ్లు కొనుక్కున్న ప్రతి ఒక్కరి భద్రతకు సంబంధించిన ప్రశ్న అని వారు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెబుతోంది.
తెలివిగా ప్రముఖ జర్నలిస్టులకు ఫ్లాట్లు అమ్మిన బిల్డర్
ఈ అపార్టుమెంట్ బిల్డర్.. మొదటి నుంచి తెలివిగా వ్యవహరించారు. ఈ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో చాలా మంది జర్నలిస్టులకు ఫ్లాట్లు అమ్మారు. ఇందులో ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ తో పాటు చాలా మంది జర్నలిస్టులు ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఎప్పుడైనా వివాదం అయితే .. వీరే మీడియాలో హడావుడి చేసి కాపాడుకుంటారన్న ఉద్దేశంతో ఇలా చేశారేమో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ కారణంగానే మీడియాలోనే హైలెట్ అవుతోంది. ఆ అపార్టుమెంట్ అక్రమం అయితే ప్రభుత్వం తక్షణమే స్పందించి, అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యతను కూడా నిర్ణయించాలని, బాధితులకు న్యాయమైన నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయం చూపకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో?
