ఈమధ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో స్పీచులన్నీ ఒకేలా తయారయ్యాయి. ‘మా సినిమా ఆడకపోతే… ‘ అంటూ ఛాలెంజులు విసరడం చాలా కామన్ అయిపోయింది. చిన్న సినిమాలు, చిన్న దర్శకులంటే.. సినిమాని ఏదోలా ప్రమోట్ చేసుకోవాలి. తప్పదు. కాబట్టి.. లేనిపోని ఛాలెంజ్‌లు విసురుతుంటారు. వాటి వల్ల కాస్తో కూస్తో పబ్లిసిటీ దొరుకుతుంది. అయితే.. పెద్ద సినిమాలూ, కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న దర్శకులు కూడా ఇదే రూటు పట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
‘రాసాజాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడి మారుతి స్పీచ్ చూస్తే ఆయన కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడేమో అనిపిస్తోంది. సినిమా ఒక్క శాతం కూడా నిరుత్సాహపరచదని, అలా జరిగితే, సినిమా నచ్చకపోతే మా ఇంటికి రండి.. అంటూ ఆయన ఇంటి అడ్రస్ కూడా అభిమానులకు లీక్ చేశాడు మారుతి. సినిమాపై ప్రతీ దర్శకుడికీ ఓ నమ్మకం ఉంటుంది. అంతలా నమ్మకపోతే సినిమా తీయడంలో అర్థం లేదు. కాకపోతే.. ఈమధ్య ఇలాంటి స్పీచులు వినీ వినీ ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ‘సినిమా రానీ.. అప్పుడు చూద్దాం’ అంటూ లైట్ తీసుకొంటున్నారు. సినిమా కాస్త అటూ ఇటూ అయినా, పాత స్పీచులన్నీ తిరగదోడుతున్నారు. ‘అప్పుడు అలా మాట్లాడావు కదా’ అంటూ గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కంటెంట్ మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు. కానీ ఈ విషయం మర్చిపోయి చాలామంది స్పీచులు దంచి కొడుతూ, ఛాలెంజులు విసురుతున్నారు. ఇప్పుడు మారుతి కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారనిపిస్తుంది. మారుతి స్వతహాగా మంచి వక్త. తన సినిమాల్లానే స్పీచులు కూడా సరదాగా ఉంటాయి. కానీ ఈసారి ఎమోషన్ అయిపోవడం ఒక ఎత్తయితే, ఛాలెంజ్ విసరడం మరోరకమైన చర్చకు దారి తీసినట్టైంది. కాకపోతే ఈ సినిమాపై ప్రభాస్ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అందుకే తన స్పీచులో మారుతిని ఆకాశానికి ఎత్తేశాడు. మారుతి రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయానని, క్లైమాక్స్ ఇరగదీశాడని, పదిహేనేళ్ల తరవాత తనకు ఎంటర్టైనర్ అందించాడని కితాబు ఇచ్చాడు. మారుతి మాటలు, ప్రభాస్ నమ్మకం నిజమైతే.. హ్యాపీనే. అప్పుడు కూడా మారుతి ఇంటి అడ్రస్స్ వెదుక్కొంటూ అభిమానులు వెళ్తారు. ఈసారి అభినందనలు తెలపడానికి.
