చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలతో ఎదిగిన దర్శకుడు మారుతి. అలాంటి దర్శకుడికి ప్రభాస్ లాంటి కింగ్ సైజ్ కటౌట్ దొరికితే? ఆ అదృష్టానికి టాలీవుడ్ అంతా కుళ్లుకుంది. ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏమిటి? అసలు ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది? అంటూ ఆశ్చర్యపోయారు. వాళ్లు ఇంకా ఆ షాక్ లో ఉండగానే ప్రభాస్ తో పాన్ ఇండియా ‘రాజాసాబ్’ అనే సినిమా తీసేశాడు మారుతి. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ ప్రయాణం ఈజీగా సాగలేదు. మూడేళ్ల సమయం పట్టింది. సినిమా రిలీజ్ డేట్లు మార్చుకొంది. రాజాసాబ్ ని ఆపి ప్రభాస్ మిగిలిన సినిమాలు చేసుకొన్నాడు. యేడాదికి రెండు మూడు సినిమాలు తీయగలిగే స్పీడు ఉన్న మారుతి… ఈ ఒక్క సినిమా కోసం మూడేళ్లు ఆగిపోయాడు. ఎట్టకేలకు తన కెరీర్లోనే భారీ బడ్జెట్… అత్యంత పెద్ద హీరోతో సినిమా పూర్తి చేయగలిగాడు. అందుకే ఆ ఉద్వేగం తన్నుకొచ్చింది. ఆ కష్టం కన్నీరు లా మారి కరిగిపోయింది. ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మారుతి మాట్లాడుతూ ఎమోషన్ అయిపోయాడు. ఓ దశలో.. మారుతి కన్నీరు ఆపడం ఎవరి వల్లా కాలేదు. చివరికి ప్రభాస్ వేదికపైకి వచ్చి మారుతిని ఓదార్చాల్సి వచ్చింది.
మారుతి సినిమాలు సరదాగా ఉంటాయి. బయట కూడా ఆయన అంతే సరదాగా ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్లో మారుతి ఎమోషన్ అవ్వడం ఎవరూ చూసి ఉండరు. కానీ ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ లో మాత్రం ఆయన కన్నీళ్లు ఎవరూ ఆపలేకపోయారు. చిన్న స్థాయి నుంచి వచ్చి, కొంచెం కొంచెంగా ఎదిగి, ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద సూపర్ స్టార్ తో సినిమా చేయడం మామూలు విషయం కాదు. బహుశా.. ఆ జర్నీ గుర్తొచ్చి మారుతి గొంతు మూగబోయి ఉంటుంది. మారుతి పడిన కష్టం, చేసిన శ్రమ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలియాలంటే జనవరి 9 వరకూ ఆగాలి. ఇకనైనా మారుతి బిగ్ లీగ్ లోకి చేరతాడా, లేదా? అనేది కూడా ఈ సినిమా ఫలితమే నిర్ణయిస్తుంది.
