తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే చేస్తూంటారు. వారిపై ప్రజల్లో అసహనం కలిగిస్తే.. చాలు ఓట్ల వర్షం కురుస్తోందని ప్లాన్ చేసుకునే రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రా కన్నా ఇప్పుడు మార్వాడీలపై అసహనం పెంచడం సులువు అనుకుంటున్నారు.
ఒక వాహనం పార్కింగ్ దగ్గర ప్రారంభమైన వివాదం
హైదరాబాద్ శివారులో ఒక దుకాణం వద్ద మార్వాడీ వ్యాపారులు ఒక స్థానిక వ్యక్తిపై వాహనం పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది, దీనితో “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదం ప్రారంభమయింది. మెల్లగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. స్థానిక వ్యాపారులు మార్వాడీలు తమ చిన్న వ్యాపారాలను ఆక్రమిస్తూ, స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఈనెల 18న స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీల వ్యాపారులు
తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు ప్రతి చిన్న సందులోనూ ఉన్నారు. ఇప్పుడు కిరాణా దుకాణాలు నిర్వహించేది కూడా మార్వాడీలే. ఇక నిర్మాణ సామాగ్రి దగ్గర నుంచి హోటళ్ల వరకూ అన్నింటిలోనూ వారు కనిపిస్తున్నారు. వీరి వల్ల స్థానిక తెలంగాణ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటోందన్న అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం ఊపందుకోలేదు. కానీ ఓ పార్కింగ్ వివాదంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు రాజకీయ వేదిక మీదకు వస్తోంది.
మార్వాడీలు దేశ ప్రజలేనంటున్న బిజేపీ
ఈ తరహా ప్రచారంపై బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. మార్వాడీలను లక్ష్యంగా చేయడం కంటే, అక్రమ బంగ్లాదేశీలు , రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని, ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ప్రచారాన్ని రాజకీయంగా ప్రేరేపితమైనదిగా చిత్రీకరిస్తూ, హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు. బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ నేరుగా కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు.
మార్వాడీ గో బ్యాక్ నినాదం ఊపందుకునే అవకాశాలే ఉన్నాయి. ఇలాంటి అవకాశం వస్తే రాజకీయ పార్టీలు వదిలి పెట్టవు. ఆంధ్రాపై ఉన్న వ్యతిరేకతను పెంచి .. సునామీలా మార్చి రాష్ట్ర విభజన చేయగలిగారు. ఇప్పుడు అది పెద్దగా వర్కవుట్ అవలేదు. వీధివీధినా వ్యాపారాలను కైవసం చేసుకున్న మార్వాడీల పై చాలా కాలంగా జరుగుతున్న చర్చను .. ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చుకోవడం ఖాయమని అనుకోవచ్చు.