మాస్ మహారాజ్ రవితేజ నుంచి వస్తున్న మరో సినిమా.. ‘మాస్ జాతర’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ వదిలారు. రవితేజ స్టైల్, ఇమేజ్, ఈజ్కి తగ్గట్టుగానే ట్రైలర్ కట్ చేశారు. టైటిల్ కి తగ్గట్టుగానే ట్రైలర్ జాతరలా ఉంది. రవితేజ నుంచి మాస్ డైలాగులు చాలా పేలాయ్.
”ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్ లోకి రాక నీ దందా నడిచింది. ఇక నుంచి సత్యనాష్..”
”నేను రైల్వే పోలీస్ కాద్… క్రిమినల్ పోలీస్”
”రైల్వేలో ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్ లు ఉంటాయ్. నేను వచ్చినాక ఒక్కటే జోన్.. వార్ జోన్”
లాంటి డైలాగులు రవితేజ పలికించారు. దీన్ని బట్టి హీరో క్యారెక్టర్ లోని పవర్ అర్థం చేసుకోవొచ్చు.
జనగణమన ఎవరు రాశారు? అని అడిగితే పూరి జగన్నాథ్ పేరు చెప్పడం ఫన్నీగా వుంది. దేవి ప్రియ – భానుప్రియ పేర్లు కూడా సెటైరిక్ గా వాడుకొన్నారు.
విలన్ గా నవీన్ చంద్ర కోసం పవర్ఫుల్ క్యారెక్టర్ రాసినట్టు అనిపిస్తోంది. తన డైలాగులు కూడా బాగానే రాసుకొన్నాడు దర్శకుడు. శ్రీలీల శ్రీకాకుళం యాసలో మాట్లాడింది. ట్రైలర్ వరకూ తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. రాజేంద్ర ప్రసాద్ కి మరోసారి వెరైటీ క్యారెక్టర్ పడినట్టు అర్థం అవుతోంది. వెంకీ, ఇడియట్, విక్రమార్కుడు సినిమాలోని ఐకానిక్ డైలాగులు, షాట్లూ ఈ సినిమాలో రిపీట్ చేశారు. దానికి సంబంధించిన హింట్ ట్రైలర్ లోనే ఉంది.
ట్రైలర్ కొత్తగా ఉంది అని చెప్పడానికి లేదు. కాకపోతే మాసీగా ఉంది. హడావుడి కనిపించింది. భీమ్స్ సంగీతంలో మోత మామూలే. సితార సంస్థ నుంచి వచ్చిన లావీష్ సినిమా ఇది. రవితేజకు 75వ చిత్రం. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
