కాకినాడ జిల్లా వేట్ల పాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో పాతిక మంది వరకూ చనిపోయారు. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. ఉగ్రవాద దాడుల్లో జరిగే పేలుళ్లు కూడా అంత ఘోరంగా మనుషుల్ని చంపి ఉండవు. అత్యంత భీతావహంగా అక్కడి దృశ్యాలు ఉన్నాయి. ఈ ప్రమాదంపై అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయనగరం పర్యటన నుంచి చంద్రబాబు హుటాహుటిన వేట్ల పాలెం వెళ్లారు.
ఎన్నో ప్రమాదాలు – ఏ ప్రమాదంలో అయినా పదుల సంఖ్యలో ప్రాణాలు బలి
బాణసంచా తయారీ కేంద్రాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. కేవలం లాభాపేక్షే పరమావధిగా, నిరుపేద కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ పరిశ్రమల్లో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లనే ఇలాంటి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.
శివకాశి నుంచి కాకినాడ వరకూ అదే పరిస్థితి
బాణసంచా రాజధాని శివకాశీలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తాయి. అక్కడ తరచూ సంభవిస్తున్న పేలుళ్లు వేలాది కుటుంబాలను అనాథలను చేస్తున్నాయి. రసాయనాల మిశ్రమంలో అజాగ్రత్త, పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేయడం, ఇరుకైన గదుల్లో ఎక్కువ మంది కార్మికులతో పనులు చేయించడం వంటి అంశాలు ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. శివకాశీలో జరిగిన ప్రతి పెద్ద ప్రమాదం తర్వాత కమిటీలు వేయడం మినహా, క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారాలు దిశగా చర్యలు శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ పరిశ్రమ పెద్దదే. గతంలో వాకతిప్ప, వెలుగుబంద వంటి ప్రాంతాల్లో జరిగిన పెను ప్రమాదాలు వందలాది ప్రాణాలను బలితీసుకున్నాయి. ప్రతి ఏటా దీపావళికి ముందు, పెళ్లిళ్ల సీజన్లో అక్రమ తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. లైసెన్స్ లేని కేంద్రాల్లో కనీస అగ్నిమాపక పరికరాలు కూడా ఉండవు. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి వదిలేయడం వల్ల యజమానులు భయం లేకుండా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
ఇంకెన్ని ప్రాణాలు పోతే యంత్రాంగంలో చలనం వస్తుంది?
బాణసంచా కేంద్రాల్లో కఠినమైన భద్రతా ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, కార్మికులకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం, నిబంధనలు ఉల్లంఘించిన యూనిట్లను శాశ్వతంగా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం ఎక్స్ గ్రేషియాతో చేతులు దులుపుకోకుండా, ఈ మృత్యు పరిశ్రమల పట్ల దీర్ఘకాలిక నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తే .. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు.
