బంతి ఇప్పుడు పాక్ కోర్టులోనే ఉంది: భారత్

భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ నిన్న సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. దానిలో ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ నెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం రద్దయినట్లే ఉంది.

“పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలపై తక్షణం కటిన చర్యలు తీసుకోవడానికి అవసరమయిన సమాచారం అంతా పాకిస్తాన్ కి అందజేసాము. ఈ విషయంలో మేము పాకిస్తాన్ కి ఎటువంటి గడువు విధించడం లేదు. కానీ తక్షణమే చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నాము. భారత్ ఇరుగుపొరుగు దేశాలతో బలమయిన స్నేహ సంబంధాలే కోరుకొంటోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసివచ్చేరు. కానీ అంత మాత్రాన్న పొరుగుదేశానికి చెందిన ఉగ్రవాదులు మా దేశంపై దాడులు చేస్తూంటే చూస్తూ ఊరుకొంటామని కాదు. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్ లో భారత్-పాక్ జాతీయ భద్రతా సలహాదారులు సమావేశంలో ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులే పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డారనే బలమయిన ఆధారాలను మేము పాక్ ప్రభుత్వానికి అందించాము. కనుక ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉంది. ప్రస్తుతం దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. పాకిస్తాన్ ప్రతిస్పందన చూసిన తరువాతనే మాట్లాడగలను,” అని తన ప్రసంగాన్ని ముగించారు.

“భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగుతుందా…లేదా?” అని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ “దీనిపై ఇప్పుడే ఖచ్చితంగా అవును కాదు అని స్పష్టంగా చెప్పలేను. పాక్ ప్రతిస్పందనను బట్టి దీనిపై నిర్ణయం తీసుకొంటాము,” అని బదులిచ్చారు. అంటే ఆ సమావేశం జరగాలంటే పఠాన్ కోట్ పై దాడికి కుట్రపన్నిన జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై పాక్ తక్షణమే చర్యలు తీసుకోవలసి ఉంటుందని భారత్ షరతు విధించినట్లే స్పష్టం అవుతోంది.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చినందున, ఈ దాడికి పాక్ లోనే కుట్ర జరిగినట్లు ఆయన స్వయంగా ద్రువీకరించినట్లయింది. కనుక తక్షణం వారిపై చర్యలు తీసుకోవలసి ఉంది. లేకుంటే భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం రద్దయ్యే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ పాక్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచవచ్చును. అయితే ఉగ్రవాదులపై చర్యలు చేపట్టడం హామీ ఇచ్చినంత తేలిక కాదు. కనుక దానికి కొంత సమయం పట్టవచ్చును. కనుక విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగే అవకాశాలు కూడా లేవనే భావించవచ్చును.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిన్న రక్షణ, హోం శాఖ విదేశాంగ శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పఠాన్ కోట్ దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై చర్యలు చేపట్టడం గురించి చర్చించారు. ఈ దాడికి సంబంధించి మరి కొంత సమాచారాన్ని భారత్ నుండి కోరాలని ఆ సమావేశంలో నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com