ఓ భార్య , భర్త. వారి మధ్య మరో అమ్మాయో…అబ్బాయో . అ పంచాయతీని తీసుకు వచ్చి..బతుకు జట్కాబండి పేరుతో ఎపిసోడ్స్ చేసేవి ఎంటర్టెయిన్మెంట్ చానళ్లు. ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి కథలు ఎవరూ చూడటం లేదని ఆపేశారు. కానీ కొత్తగా మీడియా చానళ్లు అందుకున్నాయి. హీరో ధర్మమహేష్ అట.. పట్టుమని పది మందికి కూడా తెలియని సినిమాల్లో నటించారు. ఆయన భార్య గౌతమి చౌదరి . ఇద్దరి మధ్య ఏదో జరిగింది. అంతే ఇంత కంటే సమస్యల్లేనట్లుగా ప్రైమ్ టైమ్లో డిబేట్లు పెడుతున్నాయి చానల్స్.
వారు చెప్పే మసాలా కథలు.. ఒకరిపై ఒకరు చేసుకునే మస్కా ఆరోపణలకు ట్విస్టులు ఇచ్చి ప్రసారం చేసుకుంటున్నారు. అసలు వారి కుటుంబ సమస్య గురించి మాకెందుకు అని ఒక్క సారి కూడా ఆ చానళ్లు ఆలోచించడం లేదు. రోజా అదే రొద. చివరికి ఆ ఇళ్లలో పెద్దవాళ్లూ తమకు ఇంతకు మించిన పబ్లిసిటీ ఎప్పుడూ రాదని మీడియా ముందుకు వచ్చి షో చేసి పోతున్నారు. ఇదేం పంచాయతీరా బాబూ అని చూసేవాళ్లు అనుకోవాల్సిన పరిస్థితి.
ఈ పంచాయతీ చాలా కాలంగా సాగుతోంది. ఆ గౌతమి చౌదరి.. ఇటు ధర్మమహేష్ ఇద్దరూ.. “మాస్”మీడియాకు కావాల్సిన మసాలా కబుర్లు చెప్పినంత కాలం నడిపిస్తారు. తరవాత ఇంకోటి. ఇప్పటికే వర్షిణి పేరుతో మరో ఎపిసోడ్ రెడీ చేస్తున్నారు. ఈ వర్షిణి ఎవరయ్యా అంటే.. అఘోరితో వెళ్లిపోయిన అమ్మాయి. ఇప్పుడు అఘోరిపై ఆరోపణలు చేస్తోంది. ఆమెతో లైవ్ షోలకు రెడీ కావాల్సిందే.