మత రాజకీయాలు చేస్తూ వివాదాస్పద అంశాలతో విద్వేషం పెంచుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న బండి సంజయ్..తాను అభివృద్ధిపై మాట్లాడితే మీడియా ఇవ్వడం లేదని అంటున్నారు. బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూత్వంపైనే ఫోకస్ చేస్తున్నారుని అన్నారు. అంటే తాను మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ కావాలనే బండి సంజయ్ ఇలా హిందూత్వం మాట్లాడుతున్నారని చెప్పకనే చెప్పారు.
తాను కేవలం హిందత్వం గురించి.. మాత్రమే మాట్లాడటం లేదని అభివృద్ధి గురించి కూడా చెబుతున్నానని అంటున్నారు. తన ప్రసంగంలో అన్ని అంశాలు ఉన్నా.. మీడియా మాత్రం హిందూత్వంపైనే ఫోకస్ చేస్తోందని..తప్పంతా మీడియాదే అన్నట్లుగా బండి సంజయ్ చెబుతున్నారు. అయితే ఆయన అంశాలు అత్యంత వివాదాస్పదంగా ఉండటంతోనే మీడియా కూడా హైలెట్ చేస్తోంది. ఆ విషయం ఆయనకు తెలియదని అనుకోలేం.
బండి సంజయ్ హిందూత్వ మాటలపై ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అది మంచిది కాదని అంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్.. అధికారిక విధుల్లో పెద్దగా కనిపించరు. తెలంగాణలోనే ఎక్కువగా రాజకీయాలు చేస్తూంటారు. మావోయిస్టుల గురించి తాజాగా దూకుడు ప్రకటనలు చేస్తున్నారు. అర్బన్ నక్సల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.

