ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజన్న సంగతి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆగస్టు మొదలైందంటే చిరు పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాచేట్టు ఎదురు చూస్తుంటారు. మెగా సినిమాలకు సంబంధించిన అప్డేట్లూ, పోస్టర్లు, టీజర్లూ వస్తాయన్నది వాళ్ల ఆశ.. ఆకాంక్ష.
ఈ బర్త్ డేకీ చిరు నుంచి కొన్ని సర్ప్రైజ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ చిరు పుట్టిన రోజునే రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘మన శివ శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ‘సంక్రాంతి..’ అనే సౌండింగ్ వచ్చేలా మరో టైటిల్ కూడా అనుకొన్నారు. చిరు దేనికి ఓటేస్తే.. అదే టైటిల్ గా బయటకు వస్తుంది. ఇప్పటికే టైటిల్ పై చిత్రబృందం కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇది వరకే టీజర్ విడుదల చేశారు. ఓ పాట కూడా బయటకు వచ్చింది. చిరు పుట్టిన రోజుకి మరో పాట విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవల భీమ్స్ స్వరకల్పనలో ఓ ఐటెమ్ పాట తెరకెక్కించారు. ఆపాటే బయటకు వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిరు – బాబి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన వెంటనే బాబీ చిత్రమే పట్టాలెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సూపర్ హిట్ తరవాత రాబోయే సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిరు పుట్టిన రోజునే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.