‘రేపు సాయింత్రం 4 గంటలకు చిరంజీవి గారింట్లో చిన్న గెట్ టు గెదర్.. కెమెరాలు వద్దు.. జస్ట్ క్యాజువల్ మీట్ అంతే..’
మెగాస్టార్ పీఆర్ టీమ్ నుంచి ఓ వాట్సప్ సందేశం.
ప్రచారాల కోసం కాకుండా, పరిచయాల కోసం, పలకరింపుల కోసం ఓ స్టార్ హీరో పిలుపురావడం ఈ రోజుల్లో నిజంగా ఒకానొక అరుదైన సందర్భం.
మెగాస్టార్‌కు ముందు నుంచీ ఈ అలవాటు ఉంది. తన ఉన్నతిలో, తన కీర్తిలో, తన ప్రయాణంలో ‘మీడియా’కూ భాగం ఉందని బలంగా నమ్మే హీరో ఆయన. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఇంట్లో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండేవి. ఈమధ్య కాలంలో మాత్రం ఇదే తొలిసారి.
3.45 నిమిషాలకే దాదాపు 30మంది పాత్రికేయులు చిరంజీవి ఇంట్లో, కేటాయించిన సీట్లలో ఆశీనులైపోయారు.
చెప్పినట్టే సరిగ్గా 4 గంటలకు.. ఒక నిమిషం ఎక్కువా కాదు. తక్కువ కాకుండా.. మొహంపై చెరగని చిరునవ్వుతో మెగాస్టార్ ఆగమనం..
ఆ ముఫ్ఫై మందిలో చిరుకి బాగా ఇష్టులైన జర్నలిస్టులు ఉన్నారు. ముఖ పరిచయం ఉన్నవాళ్లు ఉన్నారు. కొత్తవారూ ఉన్నారు. తెలిసిన వాళ్లని పేరు పేరునా పలకరిస్తూ, కొత్తవారిని పరిచయం చేసుకొంటూ దాదాపు గంటన్నర సేపు ముచ్చటించుకొంటూ.. ఓ సాయింత్రాన్ని మధుర జ్ఞాపకంగా మార్చేశారు మెగాస్టార్.
‘ఈ జిలేబీ తినండి బాగుంటుంది..’
‘వడాపావ్ మీకు నచ్చుతుంది.. టేస్ట్ చేయాల్సిందే’ అంటూ దగ్గరుండి మరీ రుచుల్ని కొసరి కొసరి వడ్డింపజేశారు.
డైట్ ని నిక్కచ్చిగా ఫాలో అయ్యే హీరో చిరంజీవి.
సాయింత్రం జర్నలిస్టులతో విందు ఏర్పాటు చేసి, తాను తినకపోతే ఎలా? అందుకే మధ్యాహ్నం భోజనం ‘కట్’ చేశారు. అతిథులకు ఆయన ఇచ్చిన మర్యాద అది.
పాత సినిమాలు.. కొత్త సంగతులు
ఎదురొచ్చిన మలుపులు.. ఎదురొడ్డిన పరిస్థితులు..
టైమ్ మిషన్ ఎక్కినట్టు అన్నీ రివైండ్ చేసుకొన్నారు.
ఎవరు ఏ ప్రశ్న అడిగినా, అది ఎలాంటిదైనా, ‘చెప్పాలా, చెప్పకూడదా’, ‘ఇప్పుడు అవసరమా’ అనే మీమాంశ లేకుండా అన్నింటికీ ఓపిగ్గా, నవ్వుతూ సమాధానాలు చెప్పారు.
ఆఫ్ ద రికార్డ్ అనుకోదగ్గ ముచ్చట్లెన్నో.. ఆ సాయంకాలం పలకరించి వెళ్లాయి.
‘ఇందువదన.. కుందరొదన.. వావ్.. మీ మీద మీరే ఎలా సెటైర్ వేసుకొన్నారు సార్ అని అడిగితే..’
‘ఆ పాట అంతలా ట్రోల్ అయ్యిందన్న సంగతి నాక్కూడా తెలీదు. బాగుంటుంది చేయండి అని రావిపూడి అడిగితే కాదనలేకపోయా’ అంటూ మనసు విప్పారు.
‘వయసుకు తగ్గ పాత్రలు చేయాలని నాకూ ఉంటుంది. అలాంటి కథలు రావాలి కదా’ అనే మాటల్లో మారిన ప్రేక్షకుల అభిరుచిని ఆయన ఎంతగా పట్టుకొంటున్నారో అర్థం అవుతోంది.
పాడ్ కాస్ట్ చేయాలన్న కోరిక, డాక్యుమెంటరీ తీసుకురావాలన్న ఆలోచన.. జర్నలిస్టులతో పంచుకొన్నారు.
‘త్వరలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తవుతున్నాయి కదా, ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేయొచ్చు కదా..’ అని అడిగితే..
’50 ఏళ్లు పెద్ద మైల్ స్టోన్ అనుకోను. చాలామంది నటీనటులు దాన్నెప్పుడో దాటేశారు’ అని సింపుల్ సిటీ చాటుకొన్నారు.
సంక్రాంతికి విడుదలైన నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు హిట్టయినందుకు ఆయనా ఆనందపడ్డారు. త్వరలోనే ఆ సినిమాల్ని చూస్తానన్నారు.
‘సార్.. లేటవుతుంది.. ఇక్కడితో ముగిద్దామా’ అని పీఆర్ టీమ్ అడిగితే..
‘ఫర్లేదు.. చాలా కాలమైంది ఇలా మాట్లాడుకొని, ఇంకాసేపు కూర్చుందాం’ అని ఆ ప్రవాహాన్ని కొనసాగించారు.
వెళ్తూ.. వెళ్తూ అందరితోనూ ప్రత్యేకంగా ఫొటోలు..
‘మిమ్మల్ని ఇది వరకు కలిశాను కదా’ అని ఆ పాత రోజుల్లోకి లాంగ్ జంప్‌లు.
ఇంత ఓపిక.. ఇంత మర్యాద..?
అందుకే కదా మిమ్మల్ని మెగాస్టార్ అనేది.
చివరిగా ఓ మాట అన్నారు. అది మాత్రం గుర్తు పెట్టుకోదగినది.
‘నా గురించి బాగా రాసినా, రాకపోయినా నేనెప్పుడూ ఫీలవ్వను. అది మీ వృత్తిలో ఓ భాగం. మీ వృత్తి ధర్మాన్ని మీరు నిర్వహిస్తున్నారంతే. దాన్ని నేను గౌరవిస్తా’ అనడం మీ మర్యాదను, జర్నలిస్టుల మీద మీకున్న గౌరవాన్ని మరింత స్పష్టం చేసింది.
సినిమా ప్రమోషన్ల కోసం మినహా, మిగిలిన సమయాల్లో మీడియాకు దూరంగా ఉంటూ, వీలైనంత అవాయిడ్ చేయడానికి చూసే ఇలాంటి జనరేషన్లో.. పనిగట్టుకొని మరీ పిలిచి, పలకరించి, గౌరవించి, ఓ సాయింకాలాన్ని అందమైన ఆల్బమ్ గా మలిచిన మెగాస్టార్ నిజంగా ప్రత్యేకమే కదా..!
‘తెలుగు360’ అనగానే..
‘మీ వెబ్ సైట్ చూస్తుంటా.. ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు’ అనడం.. నిజంగా మాకు పెద్ద బూస్టప్.
వన్స్ ఎగైన్ థ్యాంక్యూ సార్..
మీరు ఇలానే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి..
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూనే ఉండాలి..
ఆల్ ది బెస్ట్!!
