ఆచార్య ట్రైల‌ర్‌: మెగా యాక్ష‌న్ ప్యాక్డ్స్‌

చిరంజీవి – రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ఒకేసారి వెండి తెర‌పై చూడాల‌న్న కోరిక‌.. `ఆచార్య‌`తో మ‌రోసారి తీర‌బోతోంది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం ఈనెల 29న విడుద‌ల కాబోతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌దిలారు.

సాధార‌ణంగా చిరు సినిమా అంటే… మాస్‌, ఫ్యామిలీ, స్టెప్పులు, కామెడీ ఇవ‌న్నీ క‌లిసే ఉంటాయి. అభిమానులు కూడా అవ‌న్నీ ఉండాల‌ని ఆశిస్తారు. కానీ… ఆచార్య చూస్తే మొత్త‌మంతా యాక్ష‌న్ ఎపిసోడ్స్ తోనే ద‌ట్టించిన‌ట్టు అనిపిస్తోంది. 2 నిమిషాల 30 సెక‌న్ల ఈ ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ ఘ‌ట్టాల‌కు, ఎలివేష‌న్ల‌కూ సింహ‌భాగం కేటాయించారు. అవ‌న్నీ మాస్ కి న‌చ్చే విష‌యాలే. ధ‌ర్మ‌స్థ‌లిలో.. ర‌క్త‌పాతం పారుతుంటే.. సిద్ధ (రామ్ చ‌ర‌ణ్ ) అడ్డుకుంటాడు. త‌న గైర్హాజ‌రులో మ‌ళ్లీ.. ధ‌ర్మ‌స్థ‌లిలో హింస మొద‌ల‌వుతుంది. అప్పుడే ఆచార్య అడుగు పెడ‌తాడు. ప‌క్కా సినిమాటిక్ స్క్రీన్ ప్లేనే… ట్రైల‌ర్‌లోనూ చూపించార‌నిపిస్తోంది. చిరంజీవి సినిమాల ట్రైల‌ర్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా అనిపించింది. కొర‌టాల శివ సినిమాలో ఏదో ఓ బ‌ల‌మైన సామాజిక అంశం ఉంటుంది. ఈ సినిమాలో అదేమిట‌న్న‌ది.. ట్రైల‌ర్‌తో స్ప‌ష్టం చేస్తారనుకుంటే, ఆ పాయింటేం క‌నిపించ‌లేదు. విజువ‌ల్స్‌, గ్రాండియ‌ర్‌, ఆ లుక్‌.. ఇవ‌న్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. టీజ‌ర్‌లో.. చిరు, చ‌ర‌ణ్ ఓవైపు.. ఓ పులి, పులి పిల్ల మ‌రోవైపు ఉండేలా క‌ట్ చేయ‌డం… మెగా ఫ్యాన్స్ ని విప‌రీతంగా న‌చ్చేసింది. ఆ స్థాయిలో కాక‌పోయినా.. ఓ యాక్ష‌న్ సీన్‌లో చిరు, చ‌ర‌ణ్ రెచ్చిపోవ‌డం మెగా అభిమానుల‌కు జోష్ తీసుకొస్తుంది. చిరు చేతుల మీద నుంచి.. చ‌రణ్ ఎగిరి, శ‌త్రువు గుండెల్లో ఆయుధం దించే షాట్‌.. పండగే. చివ‌ల్లో చ‌ర‌ణ్‌, చిరు ఇద్ద‌రూ క‌లిసి ఓ పాట‌కు స్టెప్పేశారు. చిరు సిగ్నేచ‌ర్ స్టెప్పులు, పంచ్ డైలాగులూ… ట్రైల‌ర్‌లో వినిపించ‌క‌పోవ‌డం, పూజా హెగ్డేకి ఒక్క డైలాగ్ ఇవ్వ‌కుండా, ఒక్క ఫ్రేముకే ప‌రిమితం చేయ‌డం కొంచెం అంసంతృప్తిగా అనిపించే అంశాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.