“మేఘా” అంటే కృష్ణారెడ్డి.. మేఘా కృష్ణారెడ్డి అనే పిలుస్తారు. అయితే మేఘా కంపెనీ వ్యవస్థాపకుడు మాత్రం ఆయన కాదు. ఆయన మామ పిచ్చిరెడ్డి. 1990లలో మున్సిపాలిటీలకు చిన్న చిన్న పైప్‌ల సరఫరా చేస్తూ మేఘా కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ కంపెనీని ఓ రేంజ్ కు తీసుకెళ్లింది మాత్రం కృష్ణారెడ్డి. రాజకీయాలతో సన్నిహితమయ్యారో… కమిషన్లు ఇచ్చారో ఇంకేం చేశారో అన్నది పక్కన పెడితే కంపెనీని దేశస్థాయికి విస్తరించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. వివిధ రంగాల్లోకి విస్తరించారు.
ఇప్పుడు ఈ కంపెనీలో తన మామ పిచ్చిరెడ్డికి ఉన్న 49 శాతం వాటాలను పూర్తిగా నగదు రూపంలో సొమ్ము ఇచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ జెయింట్ ఓక్ట్రీ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుంచి రూ. 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో అదే అతి పెద్ద ప్రైవేటు ఫైనాన్సింగ్ డీల్. మొత్తం కంపెనీ నుంచి బయటకు వెళ్లడానికి తాను.. కంపెనీలో పూర్తి స్థాయి యజమానిగా మారడానికి కృష్ణారెడ్డి.. తన మామకు రూ. 12 నుంచి 15వేల కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓక్ట్రీ క్యాపిటల్ తో కృష్ణా రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రుణాన్ని మార్చి 2027 వరకు డ్రా చేసుకోవచ్చు. పది వేల కోట్లు తీసుకోవాలని రూలేం లేదు. ఎంత అవసరం అయితే అంత తీసుకోవచ్చు. అయితే కృష్ణారెడ్డి మరో ప్లాన్ లో కూడా ఉన్నారని అంటున్నారు. వడ్డీ భారం తగ్గించుకోవడానికి కొన్ని వ్యాపారాలని ఆదాని గ్రూప్‌నకు విక్రయించాలన్న ఆలోచన చేస్తున్నారు. పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో వాటాలు అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్స్‌ను అదానీ గ్రూప్‌కు విక్రయించి 7,000 కోట్లు సమకూర్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
MEIL గ్రూప్ ప్రాజెక్ట్స్ విలువ 1 లక్ష కోట్ల వరకూ ఉంటుంది. ఫ్యామిలీ బైఅవుట్ ప్లాన్ చేయడానికి కారణం.. మేఘా కృష్ణారెడ్డి తన వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని అనుకుంటున్నారని అందుకే.. మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటున్నారని అంటున్నారు.