సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ వస్తున్నారు. మామూలుగా అయితే ఆయన వస్తున్నా.. అది చాలా మామూలు ఈవెంట్ గా నడిచిపోయేది. ఎందుకంటే హైదరాబాద్‌లో ఫుట్ బాల్ అంటే ప్రాణం పెట్టేంత ఫ్యాన్స్ ఎక్కువ మంది లేరు. కోల్ కతాలో ఉంటారు.. కేరళలో ఉంటారు. ముంబైలో ఉంటారు. ఢిల్లీలో ఉంటారు. అందుకే మొదట మెస్సీ ఇండియాలో గోట్ టూర్ పెట్టాలనుకున్నప్పుడు హైదరాబాద్ లేదు. కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. కోచి ఈవెంట్ రద్దు కావడంతో అనూహ్యంగా హైదరాబాద్ తెరపైకి వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఫ్యాన్
మన దేశంలో అందరూ మొదట క్రికెట్ కు ఫ్యాన్స్ . తర్వాతే ఇతర ఆటగాళ్లు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఫుట్ బాల్ అంటేనే ఇష్టం. చదువుకునే రోజుల నుంచి.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సేదదీరాలనుకుంటే ఫుట్ బాల్ నే ఆశ్రయిస్తారు. మెస్సీ ప్రోగ్రాం కన్ఫర్మ్ కాక ముందు కూడా ఆయన తరచూ ఫుల్ బాల్ ఆడేవారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాంటి ఫుట్ బాల్ ఫ్యాన్‌కు దిగ్గజం మెస్సీ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా?. హైదరాబాద్ లో మెస్సీ టూర్ కోసం సహకరించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు.. క్షణం ఆలస్యం చేయకుండా అంగీకరించారు.
సీరియస్ మ్యాచ్ కాదు.. ఎగ్జిబిషన్ మ్యాచ్..ఇంకా చెప్పాలంటే మనీ పిండుకునే మ్యాచ్ !
గోట్ టూర్ అని పెరు పెట్టుకున్న మెస్సీ ఓ టీంతో వస్తున్నారు. ఇక్కడ లోకల్ గా ఆర్గనైజ్ చేస్తున్న వారు.. ఆర్ఆర్9 అనే టీమ్ ను ఫామ్ చేశారు. ఆర్ ఆర్ అంటే.. రేవంత్ రెడ్డి. నైన్ అనేది రేవంత్ జెర్సీ నెంబర్. ఆ నెంబర్ పై రేవంత్ కు ప్రత్యేక ఎఫెక్షన్ ఉంది. మెస్సీని చూడటం కాదు..నేరుగా ఆయనతో మ్యాచ్ లో తలపడేందుకు అవకాశం వస్తే సీఎం ఎందుకు వదులుకుంటారు?. ప్రభుత్వం తరపున కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ తో నిర్వాహకులకు డబ్బులే డబ్బులు. ఎంతగా అంటే.. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే పది లక్షలు వసూలు చేస్తున్నారు. స్టేడియం మొత్తం టిక్కెట్లు భారీ రేట్లకు అమ్ముకున్నారు. మెస్సీ అడుగు తీసి అడుగు వేస్తే కమర్షియలే. మెస్సీ అంటే ఫుట్ బాల్ డెమీగాడ్ అని మీడియా గత వారం రోజులుగా హైప్ ఇస్తోంది. అంత కంటే కావాల్సింది ఏముంది !
రాహుల్ సహా.. ఫుట్ బాల్ ఫ్యాన్స్ అంతా రెడీ !
మిగతా చోట్ల ఏమో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట మ్యాచ్ జరుగుతోంది. రాహుల్ గాంధీకి ఇలాంటివి ఇష్టమే. అందుకే ఆయన కూడా మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. ఇతర డబ్బున్న వాళ్లు పెద్ద ఎత్తున వస్తారు. రేవంత్ రెడ్డి తరపున సెలబ్రిటీలను ఆహ్వానిస్తారు. వారు కూడా వస్తారు. కొంత మంది ఆసక్తివస్తారు. స్టేడియంలోకి రావాలన్నా వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అందుకే మెస్సీ మానియా చాలా ఖరీదైనదే. సాధారణ ఆట అబిమానులకు దూరమే. అయితే యువతకు స్ఫూర్తి కోసమే మెస్సీ టూర్ ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పుకుంటున్నారు.
