మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారు. పేరుతో పాటు చాలా నిబంధనలు మార్చారు. అందులో కీలకమైనది ఇక నుంచి నలభై శాతం రాష్ట్రాలే పెట్టుకోవడం. ఇప్పటి వరకూ కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25శాతం భరించేవి. అయితే, దీనిని 60:40 నిష్పత్తి మార్చారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాలపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా పనులు చేయడం ఆపేస్తారు.
రాష్ట్రాలు నిధులు చెల్లించడం కష్టమే
రాష్ట్రాలు తమ వాటాగా చెల్లించాల్సిన 40 శాతం నిధులను సకాలంలో విడుదల చేయలేకపోతే, ఉపాధి పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా పేద రాష్ట్రాలు తమ బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించలేక, పనుల సంఖ్యను తగ్గించుకునే ప్రమాదం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి దూరం కావడానికి, తద్వారా వలసలు పెరగడానికి దారితీస్తుంది. కేంద్రం ఈ మార్పును రాష్ట్రాల బాధ్యతను పెంచడం గా చెబుతోంది. రాష్ట్రాలు కూడా ఆర్థికంగా భాగస్వాములైనప్పుడే పనుల నాణ్యతపై పర్యవేక్షణ పెరుగుతుందని కేంద్రం వాదన.
కోట్ల మంది పేదలకు వరం ఉపాధి హామీ
దేశంలో కరువు ప్రాంతాల్లో కోట్లాది మంది పేదలకు కనీస ఆదాయం అందుతోంది. నిధుల కోత లేదా రాష్ట్రాలపై భారం పెంచడం వల్ల పథకం లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే వేతనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం కూలీలను ఇబ్బంది పెడుతుండగా, ఇప్పుడు నిధుల వాటా మార్పులు పథకం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేకపోతే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఉపాధి పనులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్నాయి.
పనుల్లో మార్పులు తేవచ్చు కానీ.. ఆర్థికపరమైన ఆంక్షలతో కేంద్రానికి ఇ్బబందే
ఉపాధి హామీ పథకం కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది గ్రామీణ భారతావనికి ఒక సామాజిక భద్రతా కవచం అని ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి, పేదలకు నష్టం కలగకుండా నిధుల సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, ఈ చట్టబద్ధమైన హక్కు కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోందని అనుకుంటే.. సరైన పనులు జరగడం లేదని అనుకుంటే..దానికి తగ్గ మార్పులు చేయవచ్చు.. కానీ మొత్తంగా పథకానికే ఎసరు పెట్టేలా రూల్స్ తెస్తే.. అది కేంద్ర ప్రభుత్వానికే సమస్యగా మారుతుంది.
