ఈ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష హోదా కోసం మ‌జ్లిస్ మ‌ళ్లీ ప్ర‌య‌త్నం..!

తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మంటూ ఏదీ లేకుండా పోయింది. ఉన్న‌వారంతా అధికార పార్టీవారూ, ఇత‌ర పార్టీల టిక్కెట్ల‌పై గెలిచి అధికార పార్టీలో చేరిన‌వారు స‌భ‌లో ఉన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో శాస‌న స‌భ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కొత్త పుర‌పాల‌క చ‌ట్టం ఆమోదం కోసం ఈ స‌మావేశాల‌ను తెరాస స‌ర్కారు నిర్వ‌హిస్తోంది. ఇక‌, ఈ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష పాత్ర ఎవ‌రిది అనేదే కొంత ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాను ఈ మ‌ధ్య‌నే కోల్పోయింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ కు మిగిలిన స‌భ్యుల సంఖ్య ఆరుగురు మాత్ర‌మే. టీడీపీకి ఇద్ద‌రున్నా.. వారిలో సండ్ర వెంక‌ట వీర‌య్య తెరాస‌కు మ‌ద్ద‌తుగానే ఉంటున్నారు. ఇక‌, మిగిలింది మ‌జ్లిస్ పార్టీ… వీరికి ఏడుగురు స‌భ్యులున్నారు. అంటే, లెక్క‌ల ప్ర‌కారం చూసుకుంటే… అధికార పార్టీ తెరాస త‌రువాత అసెంబ్లీలో సంఖ్యాబ‌లం ఎక్కువ ఉన్న పార్టీగా మ‌జ్లిస్ క‌నిపిస్తోంది.

దీంతో, త‌మ‌కు అధికారికంగా ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటూ ఇదివ‌ర‌కే మ‌జ్లిస్ ప్ర‌య‌త్నం చేసింది. తెరాస‌లోకి సీఎల్పీ విలీనం అయిన‌ప్పుట్నుంచే ప్ర‌భుత్వాన్ని మ‌జ్లిస్ కోరుతూనే ఉంది. అయితే, ఇప్పుడు త్వ‌ర‌లో స‌మావేశాలున్నాయి కాబ‌ట్టి, ఈ డిమాండ్ తో మ‌రోసారి తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలే మ‌జ్లిస్ మొద‌లుపెట్టింద‌ని స‌మాచారం. స‌భ‌లో రెండో పెద్ద పార్టీగా తామే ఉన్నామ‌నీ, ప్ర‌తిప‌క్ష హోదా త‌మ‌కే ఇవ్వాలంటూ మ‌రోసారి సీఎం కేసీఆర్ ని మ‌జ్లిస్ నేత‌లు అడుగుతున్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ విప‌క్ష హోదా కోల్పోవ‌డంతో… ఇప్పుడు ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ ప‌ద‌విని వ‌దులుకోవాల్సి వ‌స్తుంది. దీంతోపాటు, శాస‌న స‌భ స‌ల‌హా క‌మిటీలో కూడా స‌భ్య‌త్వం త‌గ్గిపోతుంది. త‌మకు ప్ర‌తిపక్ష హోదా వ‌స్తే… ఇవ‌న్నీ ద‌క్కుతాయి క‌దా అనేది మ‌జ్లిస్ ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తోంది.

సాంకేతికంగా చూసుకుంటే… స‌భ‌లో క‌నీసం 18 మంది సంఖ్యాబ‌లం ఉంటే త‌ప్ప ప్ర‌తిప‌క్ష హోదా అంటూ ద‌క్క‌దు. మ‌జ్లిస్ కి అద‌నంగా మ‌ద్ద‌తు ఇచ్చేవారంటూ ఇప్పుడు ఎవ్వ‌రూ లేరు. దీంతో విప‌క్ష హోదా ఆ పార్టీకి ద‌క్క‌డం అనుమాన‌మే అని నిపుణులు అంటున్నారు. నిజానికి, తెరాస‌కు మ‌జ్లిస్ ప్ర‌తిపక్షం కానే కాదు! నూటికి నూరుశాతం మిత్ర‌ప‌క్షం. కాబ‌ట్టి, ఆ పార్టీ చేస్తున్న ప్ర‌తిప‌క్ష హోదా ప్ర‌య‌త్నాల‌కి తెరాస నుంచి కూడా సానుకూల స్పంద‌నే ఉండే అవ‌కాశ‌మే ఉంటుంది. కానీ, లెక్క‌ల ప్ర‌కారం చూసుకుంటే… మిత్ర‌ప‌క్షానికి ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేంత సాయం తెరాస చెయ్య‌లేద‌నే అనిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష హోదా కోసం తాము ప్ర‌య‌త్నించేది ప్ర‌జ‌ల వాణిని స‌భ‌లో బ‌లంగా వినిపించ‌డానికి మ‌జ్లిస్ నేత‌లు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి, ఆ వాణి వినిపించాలంటే ప్ర‌తిప‌క్ష హోదాయే ఎందుకు, ఇప్పుడైనా మాట్లాడొచ్చు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com