జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సమస్యలన్నీ చుట్టుముట్టిన సమయంలో ఈ ఎన్నిక జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన కాళ్లకు ఎంత మంది అడ్డుపడినా సరే జూబ్లిహిల్స్ లో విజేతగా నిలవాల్సిన అవసరం కనిపిస్తోంది. గెలుపునకు చాలా మంది క్రెడిట్స్ తీసుకుంటారు కానీ.. ఓటమికి మాత్రం బాధ్యత ఆయనొక్కడిదే. అందుకే వ్యూహాత్మకంగా తాను అనుకున్న ఎఫెక్ట్ వచ్చేలా రాజకీయాలు చేస్తున్నారు. సరిపోరు అనుకున్న అభ్యర్థులను దారి నుంచి తప్పించి తాను అనుకున్న అభ్యర్థికి ప్రోత్సాహం ఇస్తున్నారు.
జూబ్లిహిల్స్ గేమ్ ఛేంజర్ మజ్లిస్
జూబ్లిహిల్స్ లో ఫలితాలను నిర్ణయించేది మజ్లిస్ మాత్రమే. ఆయన పార్టీ పోటీ చేస్తుందా.. ఇతరులకు మద్దతిస్తుందా అన్నది కూడా విజేతను నిర్ణయిస్తుంది. 2014లో మజ్లిస్ ఎవరికీ మద్దతివ్వలేదు. తమ పార్టీ తరపున నవీన్ యాదవ్ ను నిలబెట్టింది. నవీన్ కుటుంబానికి ఉన్న సపోర్టు.. మజ్లిస్ బలం కలిసి.. గెలుస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ తరపున పోటీ. చేసిన గోపీనాథ్ గెలిచారు. రెండో స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు. అప్పుడే మజ్లిస్ బలం ఏమిటో స్పష్టమయిపోయింది.
తర్వాత బీఆర్ఎస్కు సపోర్టు
అధికారంలో ఎవరు ఉంటే.. వారు తమ దారికి అడ్డం రాకుండా.. ఇతర చోట్ల వారికి మద్దతుగా ఉండే వ్యూహాన్ని మజ్లిస్ అమలు చేస్తుంది. అసెంబ్లీలో పోరాటం విషయంలో వారు ఈ రిజర్వేషన్లు పెట్టుకోరు. కానీ రాజకీయాల విషయంలో మాత్రం పూర్తిగా అదే పాటిస్తారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం జూబ్లిహిల్స్ లో అభ్యర్థిని మజ్లిస్ నిలబెట్టలేదు. బీఆర్ఎస్ కు పరోక్ష సహకారం అందించింది. ఈ కారణంగానే గోపీనాథ్ మరో రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మజ్లిస్ కాంగ్రెస్ కు సపోర్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టకపోతే కాంగ్రెస్ కే అడ్వాంటేజ్
మజ్లిస్ ఇప్పటి వరకూ అభ్యర్థిని నిలబెడతానని ప్రకటించలేదు. ఇటీవల ఓ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అదే సమయంలో చెరువులో ఉన్న వారి కాలేజీలు ఇతర ఆస్తులకు భరోసా ఇచ్చింది కూడా. అందుకే.. జూబ్లిహిల్స్ లో మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టడం దాదాపుగా ఆసాధ్యం. నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్ ఓట్లను చీల్చేలా అభ్యర్థిని నిలబెడతారు. మజ్లిస్ మద్దతుతో. జూబ్లిహిల్స్ స్థానంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది.