ఒక మహిళా ఐఏఎస్ అధికారితో తనకు సంబంధం పెట్టి చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మనస్థాపానికి గురయ్యారు. తనకున్న ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయినప్పుడే తాను సగం చనిపోయానని, ఇప్పుడు ఇలాంటి నీచమైన ఆరోపణలతో తనను, తన కుటుంబాన్ని వేధించడం కంటే విషమిచ్చి చంపేయడం మేలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన చరిత్ర తనదని, ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న తనపై ఇలాంటి బురదజల్లడం అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారుల పరువు తీయడం సరికాదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఐఏఎస్ అధికారుల నియామకాలు , బదిలీలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని అంశాలని, వాటిని ఒక మంత్రికి ఆపాదించడం అజ్ఞానమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎంతో కష్టపడి సివిల్ సర్వెంట్లుగా ఎదిగిన అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. త్వరలోనే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని, అడ్డగోలుగా వార్తలు రాసేవారికి ఆ దేవుడే శిక్షిస్తాడని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సినిమాటోగ్రఫీ మంత్రినే అయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలను తాను పట్టించుకోవడం పూర్తిగా మానేశానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త సినిమాల బెనిఫిట్ షో టికెట్ల ధరల పెంపుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆ ధరల పెంపునకు సంబంధించిన మెమోలను ఎవరు జారీ చేశారో కూడా తనకు తెలియదని, ఇకపై టికెట్ ధరల పెంపు వంటి విషయాల కోసం తన వద్దకు రావద్దని సినిమా పరిశ్రమ ప్రతినిధులకు ముందే చెప్పానన్నారు.
