కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాంబిల్లి మండలంలోని సీతపాలెం సెజ్ లో బ్లూ జెట్ హెల్త్‌కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, మళ్ళీ అభివృద్ధి పట్టాలెక్కించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ భారీ ఫార్మా యూనిట్ రాకతో ఈ ప్రాంత ముఖచిత్రం మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా 1,750 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేవలం హామీలు ఇచ్చే ప్రభుత్వం కాదు.. పరిశ్రమలను రప్పించి, యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. బ్లూ జెట్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థ ఏపీని ఎంచుకోవడం రాష్ట్రంలో మారిన వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనమని ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు.
పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాజీ పడబోమని, వేగంగా అనుమతులు మంజూరు చేస్తూ ఇన్వెస్టర్లకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. చమురు ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఏపీలో సుస్థిరమైన పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడిదారులు నమ్మకంతో ముందుకు వస్తున్నారని ఆయన విశ్లేషించారు. విశాఖ – అనకాపల్లి బెల్ట్ రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి ఫార్మా, ఐటీ హబ్‌గా అవతరిస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.