కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి కొంత మంది ఎప్పుడూ రెడీగా ఉంటారు. పార్టీ ముఖ్య నేతలు మాట్లాడేవాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తూంటారు. వాటిని రికార్డు చేసే అవకాశం ఉన్న సందర్బాల్లోనూ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూండటంతో సమస్యలు వస్తున్నాయి.
తాజాగా మంత్రి నారాయణ నెల్లూరు జిల్లా కూటమి నేతలతో ఏర్పడిన వివాదాలను సర్దిచెప్పడానికి నెల్లూరులో కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వారికి ఉాదహరణలు చెబుతున్న సమయంలో పిఠాపురం వర్మ పేరును ప్రస్తావించారు. అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేసి గెలిచారని.. వర్మను సైలెంట్ గా ఉండాలని చెప్పినా ఆయన దూకుడు చూపిస్తూండటంతో గత నాలుగైదు నెలలుగా జీరో చేసేశామని చెప్పుకున్నారు. ఈ ఆడియో సాక్షి మీడియాకు అందింది.దాన్ని వారు వైరల్ చేశారు.
ఈ కామెంట్లపై వర్మ కూడా స్పందించారు. . ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి.. వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసని..ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖ దాటనని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఫైర్ బ్రాండేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో నాది 23 ఏళ్ల ప్రయాణం..ఎన్నికల్లో చంద్రబాబు ఆగు వర్మ అంటే ఆగిపోయానని గుర్తు చేసుకున్నారు.
నారాయణ కామెంట్లపై వివాదాన్ని వర్మ అక్కడితో పుల్ స్టాప్ పెట్టినప్పటికీ నారాయణ వ్యాఖ్యలు.. ఇవాళ కాకపోతే రేపు అయినా సమస్యలుగా మారతాయి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యుల చేసి.. లీకుల పాలయి.. విమర్శలకు గురయిన టీడీపీ నేతల్లో నారాయణ మొదటి వారు కాదు. అయినా ఎవరూ జాగ్రత్తగా ఉండటం లేదు.