ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా పథకాలు అమలు చేసేది ప్రజల డబ్బులతోనే. ప్రజాధనాన్ని వృధా చేయకుండా.. అనర్హులకు చెందకుండా సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే అనేక నిబంధనలు ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు దిగిన రాజకీయ పార్టీలు.. తమ పార్టీ కార్యకర్తలకు తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు ఇచ్చి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వారు బహిరంగంగా తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదు. తనిఖీలు చేస్తే గగ్గోలు పెడుతున్నారు.
వికలాంగుల పేరుతో దోపిడీ చేసిన వైసీపీ కార్యకర్తలు
వైసీపీ హయాంలో వికలాంగుల సర్టిఫికెట్లు అర్హులకు ఇచ్చారో లేదో కానీ .. వైసీపీ కార్యకర్తలకు మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికిపైగా వైసీపీ కార్యకర్తలు వికలాంగులం అని చెప్పి పెన్షన్లు తీసుకుంటున్నారు. హాయిగా రీల్స్ చేసుకుని ప్రజాధనం తింటూ హాయిగా టైం పాస్ చేస్తున్నారు. ఇలాంటి వారందర్నీ గుర్తించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే గగ్గోలు పెడుతున్నారు. పెన్షన్లు తీసేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా వారు వికలాంగులు అయితే తీసేస్తే కచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి.కానీ వారు దొంగ వికలాంగులు అని తెలిస్తే ఎందుకు ఉపేక్షించాలి ?
తీసేయడం కాదు.. రికవరీ చేయాలి !
ప్రజాధనాన్ని దోచుకోవడం అంటే అదే. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు తీసుకున్న వారి పెన్షన్లు తీసేయడం కాదు.. వారి వద్ద నుంచి రికవరీ చేయాల్సిందే. కేసులు కూడా పెట్టాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పినట్లుగా వారికి సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపైనా కేసులు పెట్టాలి. తప్పుడు మార్గంలో డబ్బుల కోసం కక్కుర్తి పడే వాళ్లు ఉన్నంత కాలం అర్హులైన వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. నిజంగా వికలాంగులకు చెందాల్సిన మొత్తాన్ని వీరు దిగమింగారు.. ఎందుకు వారిని క్షమించాలి ?
అర్హులైన ఒక్కరికీ అన్యాయం జరగకూడదు !
పార్టీతో సంబంధం లేదు. టీడీపీ వాళ్లు అయినంత మాత్రాన.. ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటామని ..దానికి అర్హత ఉందని అనుకోవడం తప్పుడు పద్దతి. వారినైనా ఊపేక్షించకూడదు. అదే సమయంలో ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు. ఇంత కాలం ఫేక్ గాళ్లకు పర్మిషన్లు ఇచ్చి.. అసలైన వారికి పెన్షన్లు తీసేస్తే..అది వ్యవస్థల వైఫల్యం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరించాలి. అనర్హులకు తీసేస్తే ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.