“సార్, నేను మూడు సార్లు ఎంపీగా గెలిచాను. మా పార్టీ 2019లో గెలిచింది. అన్నిసార్లు ఈవీఎంలతోనే గెలిచాము. అయినా ఈవీఎంలపై అనుమానాలున్నాయి “ అని SIRపై చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యులంతా అయోమయంగా ఆయనవైపు చూశారు. చివరికి..రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడుతున్నావయ్యా.. నరాల్ కట్ అయిపోయాయి అన్న ఎక్స్ ప్రెషన్ తో ఆయన వైపు చూశారు. వారి గెలుపుపై వారే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎవరు మాత్రం చూడకుంటా ఉంటారు..?
SIR గురించి మాట్లాడమంటే అదేం వాదన బాసూ !
వైసీపీ గందరగోళ రాజకీయాలు, అడ్డగోలు వాదనలతో పార్లమెంట్ లో పరువు పోగొట్టుకుంది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరుగుతోంది. ఓటు చోరీ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఆ అంశంపై వైసీపీ తరపున మాట్లాడేందుకు అవకాశం వచ్చింది.ఆ అవకాశాన్ని మిధున్ రెడ్డి తీసుకున్నారు. ఆయనకు మించిన స్పీకర్ గెలిచిన నలుగురిలో లేరు. అవినాష్ రెడ్డికి అలాంటి వాటిపై అవగాహన ఉండదు. గురుమూర్తి, తనూజరాణి మాట్లాడతారో లేదో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. మిథున్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో చెప్పాలనుకున్నది చెప్పారు. ఓటు చోరీ గురించి మాట్లాడమంటే.. పూర్తిగా ఈవీఎంల వైపు వెళ్లిపోయారు.
ఇండియాను బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్న మిథున్‌రెడ్డి
దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకుని ఏపీకి కూడా ఆఫ్రికా చేస్తానని జగన్ మంకుపట్టు పట్టినట్లుగా వ్యవహరించారు. అలాగే మిథున్ రెడ్డి కూడా తన వాదనలకు బంగ్లాదేశ్ ను ఆదర్శంగా తీసుకున్నారు. బంగ్లాదేశ్ కూడా ఈవీఎంల నుంచి బ్యాలెట్లకు మారిందట. వాళ్ల దేశం ఇప్పుడు ఎన్నిక అక్రమాలు జరిగాయన్న కారణంగా అలా ఎన్నికైన ప్రభుత్వాన్ని తరిమేసి.. ఎన్నికలు లేకుండా ఓ వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టారు. బ్యాలెట్ల వల్ల ఎన్నికల అక్రమాలను యథేచ్చగా చేశారని ప్రజల్లో అసహనం ఉండటమే కారణం. అయినా మన దేశంలో పరిస్థితులకు.. ఇతర దేశాలతో పోల్చి సమర్థించుకునే పనికిమాలిన తెలివితేటలు.. వైసీపీ వాళ్లకు ఎవరిస్తారో కానీ పార్లమెంట్ లో పరువుపోయింది.
SIRను వ్యతిరేకిస్తున్నారో లేదో చెప్పలేదేమి ?
సరే ఈవీఎంలపై చెప్పాల్సింది చెప్పారు. జగన్ రెడ్డి కూడా గతంలో ఈవీఎంల గురించి చెప్పారు. అదంతా రికార్డుల్లో ఉంది. సమస్య అది కాదు. ఇంతకీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణను సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా అన్నది మాత్రం మిథున్‌రెడ్డి స్పష్టం చేయలేదు. ఎందుకంటే వ్యతిరేకిస్తే బీజేపీకి కోపం వస్తుంది. అందుకే ఆ ప్రక్రియ గురించి మాట్లడకుండా ఈవీఎంలంటూ తన కథ చెప్పుకున్నారు. ఎవరి బాధలు వారివి. నవ్వుకున్నా.. నటించాల్సిందే.
