ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పదకొండో తేదీన మళ్లీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత లొంగిపోవాలని సూచించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ 9వ తేదీన ఢిల్లీలో జరుగుతుంది. రాజంపేట నుంచి ఎంపీగా మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారిగా ఉన్న మిథున్ రెడ్డి నెలన్నరగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన నేరుగా లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నట్లుగా ఆధారాలు ఉండటంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ముందస్తు బెయిల్ లభించలేదు. దాంతో అరెస్టు కావాల్సి వచ్చింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అయితే ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కలసి వచ్చాయి. ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వెంటనే పిటిషన్ దాఖలు చేశారు.
తాము ఎన్డీఏకే మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. దాంతో బెయిల్ పై వెళ్లి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మిథున్ రెడ్డి ఓటు వేయనున్నారు. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ జైలుకు వెళ్లకుండా ఆయన లాయర్లు కొత్త పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పదకొండో తేదీన జైల్లో సరెండర్ కావాల్సి ఉంటుంది.
