తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చానన్నారు. ఈ మేరకు ఫేస్ బుక్‌లో ఆయన పోస్టు పెట్టారు. బ్యాంక్ లావాదేవీల కాపీలను కూడా జత చేశారు.
“నిజం గెలవాలి.. నిజమే గెలవాలి” అంటూ పోస్ట్ పెట్టిన ఆయన, డబ్బు చెల్లించిన వివరాలను కూడా వెల్లడించారు. గత ఏడాది (2024) ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, 8న మరో రూ.20 లక్షలు, 14న రూ.20 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పారు. అంతేకాకుండా, చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి రూ.50 లక్షలు తీసుకెళ్లాడని, గొల్లపూడిలో తన మిత్రులు రూ.3.5 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా వివరాలు రేపు (అక్టోబర్ 24) మాట్లాడుకుందామని ఆయన పోస్ట్‌లో తెలిపారు.
ఈ ఆరోపణలను కేశినేని చిన్ని ఖండించారు. తాను ఎప్పుడూ తన జేబులోని డబ్బులను మాత్రమే ఖర్చు చేశానని కవర్లకు పదవులు ఇవ్వరని స్పష్టం చేశారు. “ఎంపీ లేకపోతే నేను లేను” అని గతంలో కొలికపూడి చెప్పారన్నారు. “ఈ ఆరోపణలను ప్రజలు నమ్మరు. ఎవరు ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసు” అంటూ చిన్ని స్పందించారు. ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో తన అనుచరులకు పదవులు ఇవ్వలేదని ఆయన కేశినేని చిన్నిపై మండిపడ్డారు. తాజాగా డబ్బుల అంశం వెలుగులోకి తెచ్చారు.
కొలికపూడి శ్రీనివాసరావు గతంలోనూ పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా పనిచేసిన ఆయన, 2024 ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆయనపై గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు వంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎంపీని టార్గెట్ చేశారు.