హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులపై రుబాబు చేయడం, ఏకంగా కమిషనర్ మీద మతమార్పిళ్ల ఆరోపణలు చేయడం పెను దుమారం రేపింది. వీణవంకలో మినీ మేడారం జాతరలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన విధుల్లో ఉన్న పోలీసులను, ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారుల మతాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే, నిబద్ధతతో పనిచేసే అధికారులపై మతం పేరుతో చౌకబారు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని సంఘం పేర్కొంది. విధుల్లో ఉన్న అధికారులను బెదిరించడం పౌర సేవల గౌరవంపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, పోలీసు అధికారులకు, ఐపీఎస్ అసోసియేషన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అవ్వడం, మరోవైపు పోలీసులు ఆయనపై విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేయడంతో కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారు. పోలీసుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆవేశంలో అన్న మాటలే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, వారి మనోభావాలను గానీ దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని వివరణ ఇచ్చారు.
కౌశిక్ రెడ్డి తీరు అదే పనిగా వివాదాస్పదంగా మారుతోంది. ఆయన పోలీసులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారు. సీరియస్ అయితే క్షమాపణలు చెబుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఆయన విషయంలో కఠినంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.