బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో తాను ప్రస్తావించిన కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల జాబితాలో సంతోష్ రావు మొదటి వాడని పేర్కొంటూ ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి మధ్య సంతోష్ రావు ఒక గోడలా మారారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సంతోష్ రావు ఇప్పుడు రేవంత్ చేతిలో కీలుబొమ్మ అని తేల్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఒంటరి కావడానికి సంతోష్ రావు ప్రధాన కారణమని కవిత విమర్శించారు. గద్దర్ వంటి ప్రజా గాయకులు ప్రగతి భవన్ బయట గంటల తరబడి వేచి ఉన్నా లోపలికి రానివ్వలేదని, అలాగే ఈటల రాజేందర్ వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటానికి సంతోష్ రావు అనుసరించిన వైఖరే కారణమని ఆమె మండిపడ్డారు. పార్టీలోని కీలక నేతలను కేసీఆర్ నుంచి దూరం చేయడంలో సంతోష్ రావు కీలక పాత్ర పోషించారని ఆమె వివరించారు.
సంతోష్ రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రతి రోజూ సగం ఇడ్లీ తిన్నారా లేక పూర్తి ఇడ్లీ తిన్నారా అనే చిన్నపాటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. ఇది కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న వెన్నుపోటుగా ఆమె అభివర్ణించారు. సంతోష్ రావు కేవలం రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చుట్టూ ఉన్న కోటరీని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చిందని, ఇలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
కవిత హరీష్ రావుతో పాటు సంతోష్ రావును కూడా టార్గెట్ చేశారు. నిజానికి సంతోష్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఓ సారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయినా కేసీఆర్ అవసరాల కోసమే ఎంపిక చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
