ఆ పార్టీ.. ఈ పార్టీతో ఏం పని అని తన సొంత పార్టీ పెట్టేసుకున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన అధికారికంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పెడుతున్న టార్చర్ తట్టుకోలేక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సొంత పార్టీ పెట్టుకోవాలని డిసైడైన తర్వాత కూడా పదవిని వదిలేయలేదు. ఎమ్మెల్సీగానే సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ పేరు.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ.
బీసీలు ఇక గాందీ భవన్ , తెలంగాణ భవన్ ముందు పడిగాపులు పడాల్సిన పని లేదన్నారు. బీసీల్లో చట్టసభలను వెళ్లని వర్గాలను చట్టసభలకు పంపుతానని ప్రకటించారు. బీసీ సమాజాన్ని ఏకం చేసి, వారి రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడే పార్టీ తనదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారని.. బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడబోతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆ ఏ పార్టీ బీసీలను ఎలా వంచించిందో లెక్కలతో వివరిస్తానని చెబుతున్నారు.
తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రికావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బీసీలను ఏకం చేస్తే..అందరూ తన వెనుక నడిస్తే చాలు ఓట్లు వస్తాయని.. పార్టీని గెలిపించుకోవచ్చని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన సభలు ఏర్పాటు చేస్తూ అగ్రవర్ణాలపై అనుచిత భాషను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు సొంత పార్టీతో రంగంలోకి దిగిపోయారు.