రివ్యూ: ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ (అమెజాన్ వెబ్ సిరీస్)

Modern Love Hyderabad series review

”మోడరన్ లవ్” పాపులర్ అమెరికన్ వెబ్ సిరీస్. దీనికి మూలం ‘న్యూయార్క్ టైమ్స్’ లో అదే పేరుతో వీక్లీగా ప్రచిరితమైన కథలు. ఈ కథలు పాఠ‌కుల్ని అని అమితంగా ఆకట్టుకున్నాయి. అమెజాన్, న్యూయార్క్ టైమ్ సంయుక్తంగా ”మోడరన్ లవ్” పేరుతో ఈ కథలని వెబ్ సిరిస్ గా తెరకెక్కించాయి. ఆ వెబ్ సిరిస్ స్ఫూర్తిగా ‘మోడరన్ లవ్ ముంబై’ వచ్చింది. రొమాంటిక్, ప్లాటోనిక్, పేరెంట్స్, ఫ్యామిలీ, పెళ్లి, సెల్ఫ్ లవ్ ఇలా ఆరు కోణాని ఆరు కథలుగా ఇందులో ప్రజంట్ చేశారు. ఇప్పుడు దర్శకుడు నగేశ్ కుకునూర్ షో రన్నర్ గా ”మోడరన్ లవ్ హైదరాబాద్’ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. ఇందులో మొత్తం ఆరు కథలు వున్నాయి. ఎంఎం కీరవాణి ఈ సిరిస్ టైటిల్ ట్రాక్ పాడటం మరో విశేషం. మోడరన్ లవ్ స్ఫూర్తితో వచ్చిన హైదరాబాద్ మోడరన్ లవ్ కథల్లోకి వెళితే…

మై అన్‌లైక్లీ పాండమిక్‌ డ్రీమ్ పార్టనర్‌:

కొవిడ్ పాండమిక్ స‌మ‌యంలో చాలా కథలు జరిగాయి. ఆ స‌మ‌యంలో తల్లీకూతుళ్ల మధ్య జరిగిన కథ ఇది. నగేశ్ కుకునూర్ దర్శకుడు. నూర్‌ హుస్సేన్‌ (నిత్యా మేనన్‌)కి మోకాలి ఆపరేషన్ జరుగుతుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటుంది. నూర్‌ ని చూడటానికి తల్లి మెహరున్నీసా (రేవతి) వస్తుంది. తల్లీకూతుళ్లకి మాటలు వుండవు. కేవలం చూపులే. కారణం.. నూర్‌ తనకి నచ్చిన పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది. తర్వాత గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. విడాకులు తీసుకుంటుంది. అదే వేరే సంగతి. తనని చూడటానికి తల్లి రావడం నూర్ కి పెద్దగా ఇష్టం వుండదు. ఒక పూట వుండి వెళ్ళిపోతుందని అనుకుంటుంది నూర్. కానీ సరిగ్గా అదే సమయంలో లాక్ డౌన్ వ‌స్తుంది. ఇక తప్పదు.. రెండు నెలలు పాటు ఇద్దరు ఒకే ఇంట్లో వుండాలి. ఈ సమయంలో వారి మధ్య మాటలు మొదలౌతాయి. తల్లి వాత్సల్యాన్ని కొత్తగా అనుభవిస్తుంది నూర్. తల్లి మెహరున్నీసా చేసే వంటకాలు ఇందులో హైలెట్. అందులో కొన్ని పేర్లు కూడా వినుండం. ఒక రోజు హలీమ్ చేస్తుంది. హలీమ్ చుసిన మెహరున్నీసాకి చార్మినార్‌ దగ్గర తన భర్తతో తిన్న మొదటి హలీమ్ గుర్తుకు వస్తుంది. ఆ లాక్ డౌన్ లో అర్ధరాత్రి ఇద్దరూ పోలీసుల కంట పడకుండా చార్మినార్ వెళ్లి, చార్మినార్ చూస్తూ హలీమ్ తింటారు. ఫీల్ గుడ్ ఎమోషన్ తో కథ ముగుస్తుంది. నిత్యా మేనన్‌, రేవతిల నటన ఈ కథకు ప్రధాన ఆకర్షణ. నిజంగా తల్లీకూతుళ్ళు అనిపిస్తారు. దర్శకుడు నగేశ్ కుకునూర్ ఎలాంటి హడావిలేకుండా ప్లజంట్ గా ప్రజంట్ చేశాడు. అయితే సన్నివేశాలు, మాటలు చాలా నెమ్మదిగా వుంటాయి. కొంచెం ఓపికతో చూడాల్సిందే.

ఫుజీ, పర్పుల్‌ అండ్‌ ఫుల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ :

ఈ కథలో పొసెషీవ్ కోణాన్ని డీల్ చేశాడు దర్శకుడు నగేశ్ కుకునూర్. ఉదయ్‌ (ఆది పినిశెట్టి), రేణు(రీతూవర్మ) లివింగ్‌ రిలేషన్‌లో వుంటారు. ఉదయ్ గతంలో ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆ అమ్మాయి పర్పుల్‌ రంగు చెప్పులు ఉదయ్ ఇంట్లోనే ఉండిపోతాయి. ఉదయ్‌ ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదంటూ రేణు అనుమానపడుతుంది. ఈ అనుమానం పొసెషీవ్ నెస్ కి దారి తీస్తుంది. తర్వాత ఏమైయిందనేది కథ. లివింగ్‌ రిలేషన్‌ వున్న జంటలు పెళ్లి చేసుకుంటాయో లేదో తెలీదు. కానీ లివింగ్‌ వున్ననంత సేపు వారు భార్యభర్తల్లానే వుంటారు. వాళ్ళ మధ్య అవే హక్కులు ఏర్పరుచుకుంటారు. భర్త కాదు కదా ఎలా పొతే పోనీ అనే ఆలోచన వుండదు. ఆమె, అతడు ఇద్దరూ తమ సొంతమే ఇంకెవరికి చెందకూడదనే బలమైన ఫీలింగ్ వుంటుంది. ఈ కథలో ఆ పొసెషీవ్ నెస్ చాలా లైటర్ వెయిన్ లో డీల్ చేశాడు దర్శకుడు. ఆది పినిశెట్టి, రీతూవర్మ చాలా సహజంగా కనిపించారు. కొన్ని డైలాగులు బావున్నాయి. చివర్లో..”నమ్మకం అంటే పూర్తిగా నమ్మాలి” అని డైలాగ్ చెప్పిన రేణు..మళ్ళీ అనుమానంతో కాఫీ మిషన్ ని పగలగొట్టడం మానవ నైజాన్ని ఒక ఫన్నీవే లో ప్రజంట్ చేసినట్లయింది. కాస్త హుషారుగా సాగుతుందీ కథ.

వై డిడ్‌ షీ లీవ్‌ మీ దేర్‌ :

మాతృదేవోభవ టైపులో కాస్త గుండెని పట్టేసే కథ ఇది. దర్శకుడు నగేశ్ కుకునూర్ ఈ కథని చాలా ఎమోషన్ గా డీల్ చేశాడు. అనాథాశ్రమంలో పెరిగిన ప్రతి పిల్లాడి వెనుక మనసు తడిసిపోయే కథ వుంటుంది. ఇది కూడా అలాంటి కథే. తల్లిదండ్రులు చనిపోవడంతో మనవడు రాములు (నరేశ్‌ అగస్త్య), అతడి అక్కను, అమ్మమ్మ (సుహాసిని) తన రెక్కల కష్టంతో పెంచుతుంది. ఓ ప్రమాదంలో రాములు అక్క చనిపోతుంది. మరోవైపు అమ్మమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. మరో దారికనిపించక రాములుని అనాథాశ్రమంలో చేరుస్తుంది. అక్కడ పెరిగిన రాములు పెద్దవాడై ఓ కంపెనీకి సీఈవో అవుతాడు. కంపెనీకి సీఈవో అయినప్పటికీ అతడి బాల్యం ప్రతిక్షణం కళ్ళముందు కదులుతూనే వుంటుంది. చిన్నప్పుడు అమ్మమ్మ వస్తుందని అనాథాశ్రమం గేటు వద్ద నీరిక్షించే రాములు స‌న్నివేశం హార్ట్ టచ్చింగా వుంటుంది.’ అమ్మమ్మ నన్ను ఎందుకు ఇక్కడ వదిలేసింది ?” అని రాములు అంటే.. నీ భవిష్యత్ కోసం అలా వదిలేయడమే ప్రేమ అనే మాట, ఆ సన్నివేశం అద్భుతంగా కుదిరింది. అమ్మమ్మగా సుహాసిని నటన చాలా బావుంది. తెలంగాణ యాసని కూడా చక్కగా పలికింది. చిన్నప్పటి రాములు గా కనిపించిన పిల్లాడు చాలా ముచ్చటగా న‌టించాడు. ”నేను దోసెలు తింటాను..నాకు దోసెలు కావాలి” అని అడుగుతుంటే..చూస్తున్న ప్రేక్షకుడికి .. రాములు అడ్రస్ తెలుసుకొని మరీ దోసెలు పెట్టాలనిపిస్తుంది. ఈ సిరిస్ మొత్తంలో కళ్ళు చెమర్చే కథ ఇది.

వాట్‌ క్లోన్‌ వ్రోట్‌ ది స్క్రిప్ట్‌ :

అశ్విన్‌ (అభిజీత్‌) ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌. మూస కొట్టుడు సీరియల్స్ తో విసిగిపోయిన అశ్విన్‌ ఏదైనా కొత్త ప్రోగ్రామ్ ని డిజైన్ చేయాలని చూస్తుంటాడు. విన్నీ (మాళవిక) స్టాండప్‌ కమెడియన్‌. ఒక షోలో విన్నీని చూస్తాడు అశ్విన్‌. విన్నీ ప్రదర్శన అశ్విన్ కి నచ్చుతుంది. తన ఐడియాని విన్నీతో పంచుకుంటాడు. ఇద్దరు బాగా దగ్గరౌతారు. కలసి ‘తెలుగు మ్యాన్‌’ పేరుతో ఒక సిరీస్‌ చేయాలనుకుంటారు. స్క్రిప్ట్ రాస్తారు. టీవీ యాజమాన్యం విన్నీ స్థానంలో మరో అమ్మాయిని పెట్టి షో రన్ చేయాలని చూస్తుంది. తర్వాత విన్నీ షో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఉదయ్ గుర్రాల ఈ కథకి దర్శకుడు. చాలా లైటర్ వెయిన్ లో ఈ కథని డీల్ చేశాడు. అభిజిత్‌, మాళవిక నటన బావుంది. ఇద్దరి క్రియేటివ్ పీపుల్స్ మధ్య జరిగిన కథ ఇది. మెచ్యురిటీ, అండర్ స్టాండింగ్, మోడరన్ థాట్ ప్రోసస్ ఈ కథలో కనిపిస్తాయి.

ఎబౌట్‌ దట్‌ రసెల్‌ ఇన్‌ ది బుషెస్‌ :

స్నేహ (ఉల్కా గుప్తా) తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఒక మ్యారేజ్ వెబ్ సైట్ ని ఫాలో అవుతూ అందులో వున్న ప్రొఫైల్స్ ని ఎంపిక చేసుకొని డేట్ కి వెళుతుంటుంది. స్నేహ తండ్రి శ్రీధర్‌ (నరేశ్‌) ఆమె వెళ్లిన ప్రతి చోట ఒక గూడచారిలా నిఘా వేస్తుంటాడు. తండ్రి నిఘా వేస్తున్నాడనే సంగతి స్నేహకి తెలుస్తుంది. తర్వాత స్నేహ ఏం చేసింది ? తండ్రి ఎందుకు కూతురుపై నిఘా వేశాడనేది క్లైమాక్స్. ఈ కథ కూడా ట‌చింగ్‌గానే వుంటుంది. చివర్లో వచ్చిన క్లైమాక్స్ తండ్రి ప్రేమ మనసుకు హత్తుకునేలా చూపుతుంది. దేవికా బహుదనం ఈ కథకు దర్శకురాలు. స్నేహగా చేసిన ఉల్కా గుప్తా నటన ఆకట్టుకుంటుంది. నరేష్ అనుభవం ఈ కథకు ప్లస్ అయ్యింది. తల్లి పాత్రలో చేసిన దివ్యవాణి నటన కూడా బావుంది.

ఫైండింగ్‌ యువర్‌ పెంగ్విన్‌ :

ఇందు (కోమలా ప్రసాద్‌)కు తన పార్టనర్ గా ఎవరిని ఎంచుకోవాలన్న దానిపైక్లారిటీ ఉండదు. తండ్రి మంచి సంబంధం తీసుకొస్తాడు. ఆ కుర్రాడు ఇందుకు కూడా నచ్చుతాడు. కానీ నచ్చడు. ఇదేంటి.. ? ఇదే ఈ కథలో వెరైటీ. అన్నివిధాల సరిపోయే జీవిత భాగస్వామి దొరికినా.. ఇంకేదో కావాలనే తపన నేటి తరం యువతలో వుందని చెప్పడం దర్శకుడు వెంకటేష్ మహా ఉద్దేశం కావచ్చు. ఈ కథని డిఫరెంట్ గా చెప్పడానికి జంతువులు, పక్షుల ప్రవృత్తిని మగ వారి ప్రవృత్తికి లింక్ చేస్తూ ఒక ఫాంటసీ డ్రీమ్‌ని రాసుకున్నాడు. ఆ డ్రీమ్ ఏమిటో కానీ ఇందు పాత్రనే తికమకగా వుంటుంది. మొత్తానికి ఈ కథతో నేటితరం క్లారిటీ లేని వర్గాన్ని చూపించాడు దర్శకుడు. కోమలా ప్రసాద్ ప్రెజన్స్ బావుంది. జంతువులు, మనిషికి పోలిక పెడుతూ రాసిన డైలాగులు ఇందు పాత్ర‌లానే క్లారిటీ లేకుండా వున్నాయి. అవుట్ అఫ్ ది బాక్స్ ఐడియా అనుకోవాలంతే.

అమెరికన్ సిరిస్ ”మోడరన్ లవ్” సక్సెస్ కి కారణం మంచి కంటెంట్. న్యూయార్క్ టైమ్స్ లో ప్రచిరితమైన జనాదరణ పొందిన కథలని వడబోసి అత్యధిక ప్రజాదరణ పొందిన కథలని ఎంచుకొని చిత్రీకరీంచారు. మోడరన్ లవ్ ముంబై లో కానీ ఇప్పుడు ‘మోడరన్ లవ్ హైదరాబాద్” లో కానీ అలాంటి వడపోత కనిపించలేదు. ఏ కథకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎక్కడ నుండి సేకరించారనేదానికి లేదు. పైగా మేకింగ్ లో కూడా అమెరికన్ సిరిస్ ని ఫాలో అయినట్లుకనిపిస్తుంది. ఫైండింగ్‌ యువర్‌ పెంగ్విన్‌ , వాట్‌ క్లోన్‌ వ్రోట్‌ ది స్క్రిప్ట్‌ కథల్లో నటీనటులు ఎక్స్ ప్రెషన్స్ అరువుతెచ్చుకునట్లుగా వుంటాయి. ఎంత ‘మోడరన్ లవ్” తీసినా.. మనం పండక్కి పరమాన్నం వండుకుంటాం కానీ ఫిజ్జా కాదు కదా. ‘మోడరన్ లవ్ హైదరాబాద్” చూశాక ”ఇవేనా మోడరన్ లవ్ హైదరాబాద్ కథలు” అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బోలెడు ఆసక్తికరమైన కథలు భాగ్యనగరం చుట్టూ వున్నాయి. సెకండ్ సీజన్ లోనైనా ఇంట్రస్టింగ్ కథలని పట్టుకుంటారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close