మొదట్లో ప్రకృతికి మాత్రమే భక్తులు ఉండేవారు. ఆ తర్వాత రకరకాల దేవుళ్ళకు భక్తులయ్యారు. ఆ తర్వాత్తర్వాత మేం తరచుగా దేవుడితో మాట్లాడుతుంటాం, దేవుడు మా మాట వింటూ ఉంటాడు అని కామెడీగా చెప్పుకునేవాళ్ళకు సీరియస్‌గా భక్తులమయిపోయాం. ఇక ఇప్పుడు… ఆడు ఈడు అని ఏమీ లేదు…. పైన చెప్పుకునే వాళ్ళందరితో పాటు సినిమా హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, పొలిటీషియన్స్….ఒకరనేంటి? అందరికీ భక్తులమయిపోతున్నాం. కరెక్ట్‌గా చెప్పాలంటే బానిసలమయిపోతున్నాం. కొంచెం పాపులారిటీ ఉన్న ప్రతివాడికీ ఇప్పుడు సోషల్ మీడియాలో భక్తజన సంఘాలు ఉంటున్నాయి. కొంతమంది స్పాన్సర్డ్ జనాలు అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటే మనం కూడా ఆ ప్రచార హోరులో పడి పరవశించిపోతూ భక్తి మైకంలో మునిగిపోతూ ఉన్నాం. అందుకే మన కలికాల దేవుళ్ళు, అవతార పురుషులు, హీరోలు, నాయకులందరూ కూడా ప్రచారం కోసమే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టేస్తున్నారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా అలాంటి ప్రచారమే చేసుకుంది. ఆ ప్రచారాన్ని నమ్మి ఫయాజ్ సిద్దిఖీ అనే ఎన్ఆర్ఐ విద్యార్థి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ కోర్స్‌లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఆక్స్ఫర్డ్ భక్తులు, ఆ స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఫయాజ్నే తప్పు పట్టి ఉంటారు. కానీ ఫయాజ్ మాత్రం యూనివర్సిటీని తప్పు పడుతూ హై కోర్టులో కేసు వేశాడు. ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా, అత్యంత అనాసక్తికరంగా, బోర్ కొట్టించేలా పాఠాలు చెప్పారని హైకోర్టుకు విన్నవించుకున్నాడు. పాఠాలు చెప్పే విషయంలో ప్రొఫెసర్స్ అందరూ కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని విమర్శలు చేశాడు. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. త్వరలోనే జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఎలా అయినా ఉండొచ్చు కానీ సిద్ధిఖీ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బోధన సరిగా లేదంటే కుహానా మేధావులెవ్వరూ కూడా అస్సలు నమ్మరు. ఇక సిద్దిఖీకి చదవడం రాకపోతే ఎంత గొప్ప యూనివర్సిటీ వాళ్ళయినా ఏం చేస్తారు అని విమర్శించేవాళ్ళు, బూతులు తిడుతున్న ఆక్స్ఫర్డ్ భక్తులు ఎంతమంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా?
మన దగ్గర కూడా అలా పేరు మోసిన విద్యాసంస్థలు, దేవుళ్ళు, దేవధూతలుగా పిలవబడే నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను దేవుళ్ళుగా ఆరాధిస్తూ….ఆలోచనల నిండా బానిసత్వాన్ని నింపుకున్న వాళ్ళు కూడా కోట్లలో ఉన్నారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ మన పాలకులు, నాయకులు, నాయకులు కమ్ హీరోల మాటలు, చేతలను పరిశీలిస్తే చాలు….వాళ్ళను ఆరాధించాల్సిన అవసరం లేదని ఎవ్వరికైనా అర్థమవుతుంది. మాట తప్పడం, మాటలతో మాయ చేస్తూ మోసం చేయడం మన నాయకులందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు దేవుళ్ళో, నిజాయితీపరులో అయితే కచ్చితంగా కాదు. ఫకీరునని చెప్పుకుంటూ రాబోయే ఐదేళ్ళు కూడా నేనే అధికారంలో ఉండాలని ఆలోచించే రకం మన నాయకులు. మీరు ప్రపంచంలోనే నంబర్ ఒన్ అవ్వాలంటే నేను బ్రతికినంత కాలం నన్ను, ఆ తర్వాత నా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యండి అని మనల్ని బ్లాక్ మెయిల్ చెయ్యగల సమర్ధులు. ఇక మిగతా వాళ్ళు కూడా సేం టు సేం.
ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మన చైతన్యానికి భయపడి అయినా కాస్త జాగ్రత్తగా ఉంటారు. భజన బృందంలాగా ఆలోచనల్లోనే బానిసత్వం నింపుకుని భక్తలమయ్యామంటే మాత్రం వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేసేస్తూ ఉంటారు. రాచరిక కాలం నాటికి మన బానిసత్వ ఆలోచనలను తీసుకెళ్ళిపోగల సమర్థులు వాళ్ళు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఎవరికో ఒకరికి భజన బృందంగా మారిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా జీవులందరికీ కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మన విమర్శలు, ప్రశ్నలు అన్నీ కూడా డైరెక్టుగా ఆ నాయకులకు వినిపిస్తున్నాయి కనుక. సో….ప్రశ్నించే ధైర్యం చెయ్యండి. మీకు అంతా బాగుంది అనిపిస్తే కనీసం మౌనంగా అయినా ఉండండి. అంతేకానీ ప్రశ్నిస్తున్న వాళ్ళను, అన్యాయాన్ని, అక్రమాలను ఎత్తి చూపుతున్న వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు భక్తులయినంత మాత్రాన ఇక మిగతా అందరూ కూడా వాళ్ళకు భక్తులయిపోయి… బానిసల్లాగా పడి ఉండాలి అని కోరుకోవడం, మీకు నచ్చినట్టుగా లేని వాళ్ళను హింసించాలనుకోడం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఆ నాయకులు చేసే తప్పులకు వాళ్ళకంటే కూడా మీరే ఎక్కువ బాధ్యులవుతారు. సమాజానికి చెడు చేసిన వాళ్ళవుతారు.