రోడ్డు ప్రమాదాలు అతి ఎక్కువగా జరిగే దేశాల్లో మనదీ ఒకటి. రూల్స్ కు విరుద్ధంగా, మద్య తాగి నడపడం, రోడ్లు సరిగా లేకపోవడం, ఇతర కారణాల వల్ల నిమిషానికో ప్రమాదం జరుగుతుంది. నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. 2014లో మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య లక్షా 41 వేల 526. పరిస్థితి ఇంత భయానకంగా ఉంది కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ కదిలి పోయారు.
రోడ్డు ప్రమాద మృతులు అంత పెద్ద సంఖ్యలో ఉండటానికి కారణం, సకాలంలో చికిత్స అందక పోవడం. సాధారణంగా 108లో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకుపోయినా సర్కారు ఆస్పత్రుల్లో సదుపాయాలు, డాక్టర్లు ఉండే అవకాశం తక్కువ. ఇక, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేర్చుకోరు. ఎందుకంటే డిపాజిట్, బిల్లు కట్టేది ఎవరు? అందుకే గాయపడ్డ వారు మరణించడం అనివార్యం అవుతోంది. నిజానికి, గాయపడ్డ వారికి గంటలోపు సరైన చికిత్స లభిస్తే 90 శాతం మంది బతికే అవకాశం ఉందట. అందుకే, రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని మోడీ నిర్ణయించారు.
ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ ఈ విషయం ప్రకటించారు. ఇప్పటికే వైష్ణోదేవి- అమృత్ సర్ మార్గంలోని హైవేపై ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రకటించారు. ఆగస్టునుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మార్గంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారికి మొదటి 48 గంటల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. మోడీ ప్రకటించిన ప్రకారం, ఈ విధానం త్వరలోనే దేశమంతటా అమలయ్యే అవకాశం ఉంది.
మన దేశంలో ప్రభుత్వ ఆస్పత్రులు అన్ని విధాలుగా సరిగా పనిచేస్తే ఇన్ని మరణాలుండవు. కానీ డాక్టర్ల కొరత, మందుల కొరత, ఇంకా అనేక సమస్యలతో ఆ ఆస్పత్రులకు వెళ్లడమే మానేశారు చాలా మంది. ఎంత పేదలైనా ప్రయివేటు డాక్టర్ దగ్గరికి పోవడం అలవాటైంది. ఇది ప్రభుత్వాల పాపం. ఇత, ప్రయివేటు ఆస్పత్రుల వాళ్లు డబ్బులు కట్టందే చికిత్స చెయ్యరు. రోడ్డు ప్రమాద బాధితులు ఎవరో ఏమిటో తెలియదు. డబ్బు కట్టే స్తోమత ఉందో లేదో తెలియదు. కాబట్టి వారు చేర్చుకోరు. అభివృద్ధి చెందిన దేశాల్లో కార్పొరేట్ ఆస్పత్రులు సామాజిక బాధ్యతను పాటించాలి. కనీసం 10 శాతం ఉచిత చికిత్స అందించాలి. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. మన దేశంలో ఇలాంటి కచ్చితమైన నిబంధన ఏమీ లేదు. కాబట్టి మోడీ చేసిన ప్రకటన ఆపద్బంధు వంటిదనే చెప్పొచ్చు. అది వీలైనంత త్వరగా అమలైతే వేల మంది ప్రాణాలు పోకుండా చూసే అవకాశం ఉంటుంది.