భారత ఆర్మీ జవాన్లు గత దశాబ్ద కాలంగా ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్’ ఇవ్వాలని కోరుతున్నారు. అది చాలా న్యాయబద్దమయిన కోరిక కూడా. కానీ దానిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం వారి కోరికను తీర్చేందుకు కసరత్తు దాదాపు పూర్తి చేసింది. అయితే, రెండు విషయాలలో ప్రభుత్వానికి, నిరాహార దీక్ష చేస్తున్న ఆర్మీ జవాన్లకు మద్య అంగీకారం కుదరలేదు. సాధారణంగా మిగిలిన ప్రభుత్వశాఖలలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి ఇచ్చే పెన్షన్లను ప్రతీ పదేళ్ళకోసారి సమీక్షించి ప్రభుత్వం పెంచుతుంటుంది. కానీ భారత ఆర్మీ దేశానికి చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని వారి పెన్షన్లను ప్రతీ ఐదేళ్ళకోసారి సమీక్షించి పెంచేందుకు మోడీ ప్రభుత్వం అంగీకరించింది. కానీ దీని కోసం నిరాహారదీక్ష చేస్తున్న ఆర్మీ జవాన్లు ప్రతీ మూడేళ్ళకోసారి పెంచాలని కోరుతున్నారు.
దాని వలన ప్రభుత్వం మీద చాలా అదనపు భారం పడటమే కాకుండా మిగిలిన ప్రభుత్వ శాఖలలో పనిచేసినవారు కూడా తమకూ అదే విధంగా చెల్లించాలని ఆందోళన మొదలుపెడితే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అందుకే ఐదేళ్ళకోసారి మాత్రమే ఆర్మీ జవాన్ల పెన్షన్లు పెంచగలమని కేంద్రప్రభుత్వం నిర్ద్వందంగా చెప్పడంతో చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినట్లయితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక ఈ లోగానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది.ఈ ఆర్ధిక సం.లో భారత ఆర్మీ జవాన్ల పెన్షన్ చెల్లింపుల కోసం కేంద్రప్రభుత్వం రూ. 54,500 కోట్లు కేటాయించింది. ఇప్పడు మళ్ళీ కొత్తగా ఒప్పందం కుదిరినట్లయితే కేంద్రప్రభుత్వంపై మరో రూ. 8,300 కోట్ల అధనపు భారం పడుతుంది. దానితో బాటే ఎరియర్స్ చెల్లింపుల కోసం రూ. 12,500 కోట్లు భారం పడుతుంది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం ఆర్మీ జవాన్ల న్యాయబద్దమయిన ‘ఒన్ ర్యాంక్-ఒన్ పెన్షన్’ డిమాండ్ నెరవేర్చేందుకు సిద్దంగా ఉంది.
ఒకవేళ మాజీ సైనికులు తమ పట్టు విడవకపోతే కేంద్రప్రభుత్వమే ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలని భావిస్తోంది. అనేక సం.లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది కనుక ముందు దానిని అంగీకరించి తరువాత తమ అభ్యంతరాలను, సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళితే మేలేమో సైనిక ఉద్యోగులు ఆలోచించాలి. ఒకవేళ ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగినట్లయితే ఈలోగా బీహార్ ఎన్నికల గంట మ్రోగినట్లయితే ఇక ఈ సమస్య మళ్ళీ అపరిష్కృతంగా మిగిలిపోతుంది.