హైదరాబాద్: అవును! రాజమౌళి ఇప్పుడు ఎక్కడకు వెళ్ళినా వెంట ఇద్దరు బాడీగార్డ్‌లు ఉంటున్నారు. మొన్న క్రిష్-వరుణ్‌తేజ్ చిత్రం ‘కంచె’ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగినపుడు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళిని ఈ బాడీగార్డ్‌లు అనుసరించటం మీడియాకు స్పష్టంగా కనబడింది. ఆ బాడీగార్డ్‌లను చూడగానే రాజమౌళికి బాడీగార్డ్‌ల అవసరమేముందని అందరికీ అనిపించింది. ఆయన ప్రాణాలకు ఇప్పుడు ముప్పేమి ఏర్పడిందని అందరూ చర్చించుకున్నారు. అయితే బాడీగార్డ్‌లను నియమించుకోవటానికి కారణం అది కాదని తర్వాత తేలింది.
బాహుబలి చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనేకాదు, జాతీయస్థాయిలో రాజమౌళి ఒక ఐకాన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన చిత్రాల స్థాయి ఇప్పుడు వందలకోట్లకు చేరుకుంది. అసలు బాహుబలి-2 చిత్ర బిజినెస్ ఎంత ఉంటుందని ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ చిత్రాన్ని స్టాక్ మార్కెట్‌లో పెడతారని మరోవాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి అనే వ్యక్తిపై కొన్ని వందలకోట్ల వ్యాపారం నడుస్తున్నందున ఆయన అత్యంత విలువైన సెలబ్రిటీగా మారారని, అందుకే ఆయనను అనుక్షణమూ కనిపెట్టుకుని ఉండటానికి ఆయన ఆంతరంగికులు వ్యక్తిగత అంగరక్షకులను నియమించినట్లు తెలుస్తోంది.