హైదరాబాద్: పశ్చిమ గోదావరి ప్రజలకు వణుకు పుట్టిస్తున్న సూది సైకో ‘ఇదిగో దొరికాడు’, ‘అదిగో దొరికాడు’ అంటూ టీవీ ఛానల్స్‌లో ఫ్లాష్ న్యూస్ రావటమేగానీ ఆ సైకో జాడ ఇప్పటికీ తెలియలేదు. నిన్న ఉదయం సూది సైకో దొరికాడంటూ చాలా ఛానల్స్ స్క్రోలింగ్ ఇచ్చేశాయి. వీరవాసరంలో ఒక రహస్య ప్రదేశంలో అతనిని ఇంటరాగేట్ చేస్తున్నారనికూడా పేర్కొన్నాయి. తీరా చూస్తే కాస్సేపటికి జిల్లా ఎస్‌పీ భాస్కర భూషణ్ అవన్నీ పుకార్లన్నీ కొట్టిపారేశారు. అతనికోసం వేట కొనసాగుతోందని తెలిపారు.
గత 15-20 రోజులుగా ఈ సూది సైకో పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలు, ఆడపిల్లలపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బైక్ మీద రావటం, సిరంజ్‌తో గుచ్చి పరారవటం చేస్తున్నాడు. అతనిని పట్టుకోవటానికి ప.గో. పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితులు చెప్పిన ఆధారాలతో ఒక స్కెచ్ ఫోటో విడుదల చేశారు. అతని ఆచూకి తెలిపినవారికి ఒక లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించారు. జిల్లా మొత్తం జల్లెడ పడుతున్నారు. అయినా ఇంతవరకు ఉపయోగం లేకపోయింది. అయితే అతనిని పట్టుకున్నట్లు వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి. నిన్నేమో వీరవాసరం, మొన్న మొగల్తూరు, అంతకుముందు రావులపాలెంలో పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు వార్తలని తర్వాత తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏమీ పురోగతి లేకపోవటంతో పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ ‘త్వరలో’ ఎప్పుడో మరి!