ఐస్ హాకీ స్టేడియంలో మోడీకి ఏం పని?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండో సారి అమెరికా పర్యటనలో భాగంగా ఐస్ హాకీ స్టేడియంలో గడుపుతారు. అదేమిటని ఆశ్చర్యపోవద్దు. శాన్ జోన్ లోని ఎస్.ఎ.పి. సెంటర్ ఎరీనా అనేది ఐస్ హాకీ పోటీలు జరిగే స్టేడియం. అందులో మోడీకి ఏంపని అంటే చాలా పని ఉంది. ఆ భవనాన్ని మోడీ ప్రసంగించే వేదికా మలుస్తున్నారు. ఐెస్ హాకీ స్టేడియంను సభా ప్రాంగణంలో మార్చాలంటే నేల మొదలు అన్ని విధాలుగా మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటికే 6 కోట్ల రూపాయలకు పైగా ఎన్నారైలు వసూలు చేసిపనులు చేస్తున్నారు. సిలికాన్ వేలీలో హాట్ టాపిక్. ఈనెల 27న మోడీ అక్కడి ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనలో మోడీ మాడిసన్ స్క్వేర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఓ రాక్ స్టార్ వలె మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు చాలా మంది మోడీ మేనియాతో ఊగిపోయారు. మోడీ .. మోడీ నినాదాలతో హాలు ప్రతిధ్వనించింది.

ఇప్పుడు సిలికాన్ వేలీలో కూడా అలాగే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోడీ ఈవెంట్ లో రిసెప్షన్ బాధ్యతను బాలీవుడ్ నటి అశ్వినీ భావేకు అప్పగించారు. ఇంకా అనేక ప్రత్యేకతలతో ఐస్ హాకీ స్టేడియం సమూలంగా మారిపోతోంది. భవనం మధ్యలో, రివాల్వింగ్ వేదికపై నిలబడి మోడీ ప్రసంగిస్తారు. అంటే ఆయన ప్రసంగిస్తున్నంత సేపు ఆ వృత్తాకార వేదిక నెమ్మదిగా కదులుతుంది. ఈ హాలు సామర్థ్యం 18,500. కానీ ఇప్పటికే దాదాపు 40 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు చెప్పారు. ఇక, ఇంత పెద్ద ఈవెంట్ కు ఖర్చు భారీగానే ఉంటుంది. అందుకే కార్పొరేట్ విరాళాలు ఆహ్వానించారు. 3 లక్షల డాలర్ల వరకు వస్తాయని భావిస్తే 4 లక్షల డాలర్లకు పైగా వచ్చినట్టు నిర్వాహకులు వివరించారు.

ఈనెల 27న ఈ భవనం గేట్లు మధ్యాహ్నం 2.30కి తెరుచుకుంటాయి. సాయంత్రం 5 గంటలకు మూసుకుంటాయి. దీనికి హాజరయ్యే వారు సెల్ ఫోన్టు లోపలికి తీసుకునిపోవచ్చు. కానీ కెమెరాలను అనుమతించరు. అనేక ఎన్నారై సంస్థలు రేయింబవళ్లు కష్టపడి ఈ ఈవెంట్ ను గ్రాండ్ గాలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సిలికాన్ వేలీ ప్రస్తుతం మోడీ మేనియాలో మునిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com