మోదీ, ఇకచాల్లే బిహార్, ఏపీ వైపు చూడు

ఎంతో ప్రేమగా ఆదరించిన ఆంధ్రులను పట్టించుకోకుండా, `బిహార్ ..బిహార్..’ అంటూ తెగతిరిగావు. కలవరించావు, పలవరించావు. ఇప్పుడేమైందీ, నీ మొహం మాడిపోయిన పెసరట్టులా మారిపోయింది. నువ్వు చాలా తెలివిగలవాడవని అనుకున్నావు. `ప్రపంచంలోని మహామహా నాయకుల్నే బురిడీ కొట్టించగాలేనిదీ, ఈ బిహారీలు ఓ లెక్కా’ – అనుకున్నావ్. కానీ, ఏమైనవి నీ తెలివితేటలు. ఏమైనది నీ మేధస్సు. దేశమంతటా మోదీ ప్రభంజనం వీస్తుందని నీ అస్మదీయులంతా కోడై కూశారు. అవన్నీ తప్పుడు కూతలని తేలిపోయింది. అయినా ఇప్పటికీ పచ్చకామెర్ల రోగిలా ప్రవర్తిస్తానంటే ఎవ్వరూ రక్షించలేరు.

తెలుగువారు ఆమాయకులనుకున్నావా మోదీ ? హన్నాన్నా, ఎంత తప్పుచేశావు. అమరావతి శంకుస్థాపనకు ప్రత్యేక హోదా ఇవ్వకబోతే మానె, స్పెషల్ ఆర్థిక ప్యాకేజీ అయినా ప్రకటించి ఉంటే కొంతలో కొంత నీ హోదా ఇనుమడించేది. కానీ ఆ పనిచేయలేదు. పైగా చాలా ఎమోషనల్ గా బిహేవ్ చేశావు. యుమునా నది నుంచి చెంబుడు నీళ్లు, పార్లమెంట్ ఆవరణ నుంచి మూడు దోసిళ్ల మట్టి తీసుకువచ్చి మణులూ మాణిక్యాలు ఇచ్చినంత లెవల్లో ఫోజులిచ్చావు. అప్పుడే నీ గారడీ వ్యవహారం మాకు తెలిసొచ్చింది. తెలుగువాడంటే ఎవరనుకున్నావ్ ? సినారె అన్నట్లు – `తిక్కరేగిందంటే డొక్కచింపేవాడు’. రెండేళ్ల క్రిందటే ఎన్నికలు అయ్యాయికదా, ఇంకా మూడేళ్లు ఆంధ్రా వైపు చూడనక్కర్లేదన్న ఆలోచనతోనే బహుశా మా మొహాన మట్టీ,నీళ్లు కుమ్మరించినట్లున్నావ్. నీ తెలివితేటలు మా దగ్గర పనిచేయవు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నిన్ను ప్రేమించేది ఎవరో, నిన్నూ నీ మాయాజాలాన్ని ఛీత్కరించింది ఎవరో తెలుసుకో.

చింతామణి నాటకంలో బిల్వమంగళకుడిలా ప్రవర్తిస్తున్నావు. తాడు ఏదో, పాము ఏదో తెలియకుండా ఉంది నీకు. వాస్తవాలను ఇప్పటికైనా గ్రహించాలి. బిహార్ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే వేలంపాట ధోరణిలో ఆర్థిక ప్యాకేజీని చాలా గొప్పగా ప్రకటించావు. నీలోని గుజరాతీ వ్యాపారి లక్షణాలు అప్పుడే గ్రహించారు బిహారీలు. నువ్వూ, నీ మిత్రుడు అమిత్ కలసి ఆడిన నాటకాలన్నీ అక్కడి ప్రజలకు తెలిసిపోయాయి. దేశమంతటా అసహనం ఉందంటూ మేధావులు మొత్తుకుంటుంటే, కనీసం మనసుపెట్టి స్పందించలేకపోయారు. నీ పార్టీలో ఏ మేరకు లౌకిక భావజాలమున్నదో అందరికీ తెలిసిపోయింది. పైగా నీ పాత మిత్రుడు నితీశ్ పై లేనిపోని అభాండాలు వేస్తే ప్రజలెందుకు నమ్ముతారు చెప్పు. చక్కటి పాలన అందించే వారిని ఎప్పుడూ అక్కున జేర్చుకుంటారు. కానీ, టక్కుటమార విద్యలు ప్రదర్శించేవారికి అదనుచూసి వాతపెడతారు. స్థానిక నేతలను ఎదగనీయకుండా సాగించిన నీ `ఏక’పాత్రకు తెరదించారు.

మోదీ, నువ్వు తెలివైన వాడివే. కానీ అప్పుడప్పుడు వక్రమార్గం పడుతుంటావు. మంచి మాటకారివి. దేన్నైనా మార్కెటింగ్ చేసే శక్తి చాలానేఉంది. నీ నేర్పరితనం, నీ పాలనా దక్షత అన్నీ , సంకుచిత ఆలోచనలతో గ్రహణం పట్టిన సూర్యుడిలా మార్చేస్తున్నాయి. బిహారీలకు లక్షాపాతికవేల కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడే నీ తెలివితేటలు బయటపడ్డాయి. ఈ ఉదారవాదం వెనుక రాజకీయం ఏ స్థాయిలో ఉన్నదో బిహారీలు తెలుసుకోగలిగారు. అయితే, డబ్బు ఎవరికి చేదు. అందుకే తప్పట్లు కొట్టారు. తప్పట్ల హోరుచూసి విజయం తథ్యమనుకున్నావు. ఆ తర్వాత ఎడతెరపి లేకుండా ప్రచారసభల్లో రెచ్చిపోయావు. కానీ బిహారీల మనసు మార్చలేకపోయావు. చివరకు అవమానమే మిగిలింది. తెలివితేటలు ఒకరి సొత్తు కాదు మోదీ…

ఇక అంధ్రా విషయానికి వద్దాం. ఆంధ్రులు కోరుకోకపోయినా రాష్ట్రం రెండుముక్కలైంది. రాజధాని లేని ముక్కని ఆంధ్రులు అభివృద్ధిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న చతురతతో గ్లోబల్ గా మార్కెటింగ్ వాల్యూ పెంచగలిగారు. సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాలనుంచి పెట్టుబడులు రాబట్టగలుగుతున్నారు. అంతేకాదు, సునాయాసంగా 30వేల ఎకరాలకు పైగానే భూమిని సమీకరించగలిగారు. మరో పక్క కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ తెప్పించుకుని రాజధాని నిర్మాణం మొదలుపెడదామనుకున్నారు. అందుకే శంకుస్థాపన కార్యక్రమాన్ని హడావుడిగాచేసి మోదీ నుంచి పెద్ద మొత్తాన్ని అందుకుందామనుకున్నారు. చివరకు నువ్వు ఇచ్చిన మన్ను-నీళ్లు బాబుకు మిగిలాయి. ప్రేమించే వాళ్లను దూరం చేసుకోవడమంటే ఇదేనేమో…

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆంధ్రులు ఆగ్రహించకముందే, యావత్ దేశం గర్వించే స్థాయిలో తలపెట్టిన రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయండి. మీ అతి తెలివితేటలు ఆంధ్రుల దగ్గర ప్రదర్శించకండి. మాకు బాగా తెలుసు, బిహార్ కు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వెంటనే రిలీజ్ చేయరని. ఇప్పుడున్న పరిస్థితుల్లో పైకి చెప్పే మాటలకీ, చేతలకీ చాలా దూరం ఉంటుంది. బిహార్ వ్యవహారం వికటించింది కనుక ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆంధ్రాకు నిధులు అందజేయండి. ఎలక్షన్ డ్రామా ముగిసింది కనుక, ఇప్పుడు ఎవరికి తక్షణ అవసరమో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఖజానా నుంచి నిధులు మళ్ళించడమే వివేకవంతుల చేసేపని. శంకుస్థాపన అయినతర్వాత వేగవంతంగా పనులు మొదలుపెట్టాలంటే మాటలా. అందుకే వెంటనే స్పందించండి.

మీమీద ఆశపెట్టుకున్నవారినీ, మిమ్మల్ని ప్రేమించే వారినీ మరచిపోయి బిహార్ మీద గుడ్డి వ్యామోహం పెట్టుకున్నందుకు తగిన శాస్తే జరిగింది. ఇప్పటికైనా మీలోని జ్ఞాననేత్రం తెరవండి. మోదీ, ఇక చాల్లే బీహార్, ఏపీ వైపు చూడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరులో జగన్ – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ క్రిస్టినా !

గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభ పెట్టి పాత క్యాసెట్ ను తిరగేస్తున్న సమయంలో .. గుంటూరు జడ్పీ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా వేమూరులో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటన్న చంద్రబాబు...

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close