భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేస్తాం, భారతదేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాం అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ అండ్ ఆయన భజన పరులందరూ కూడా గల్లీ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. ఆర్బిఐ మాజీ గవర్నర్‌ని విమర్శించినప్పుడు, ఇంకా అనేక సందర్భాల్లో కూడా సుబ్రణ్యస్వామికి మేధావి అన్న సర్టిఫికెట్‌ని ఇచ్చేశారు బిజెపి వాళ్ళు. ఇప్పుడు ఆ సుబ్రణ్యస్వామితో సహా ఎంతోమంది బిజిపి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు, ప్రతిపక్షపార్టీలన్నీ కూడా మోడీ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆనుపానుల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న మన్మోహన్ సింగ్ అయితే కేవలం రాజకీయ విమర్శలు కాకుండా సబ్జెక్టుపైనే విపులంగా మాట్లాడారు. ఆయన కరెక్ట్‌గానే మాట్లాడారని కొంతమంది సీనియర్ మోస్ట్ ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న నిపుణులు చెప్తూ ఉన్నారు.
అయితే ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా, ఎంత మంది చనిపోతున్నా మోడీ అండ్ ఆయన భజనపరులు మాత్రం ఎదురుదాడి మంత్రాన్నే జపిస్తున్నారు. కొత్త నోట్ల ప్రింటింగ్ నుంచి…వాటిని సకాలంలో ప్రజలకు చేరవేయడం వరకూ ప్లానింగ్‌కి సంబంధించిన ఎన్నో లోపాలు బయటపడుతూ ఉన్నాయి. అందుకే మోడీ కూడా రద్దు నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు నుంచే రోజుకోరకమైన విధానాలను మార్చుకుంటూ పోతున్నాడని మన్మోహన్ సింగ్ విమర్శించారు. మనందరి కళ్ళకూ కనిపిస్తున్న వాస్తవం అది. కానీ మోడీ అండ్ కో మాత్రం కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి 2014 ఎన్నికల సమయంలో పాడిన పాచి పాటను మరోసారి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీకి పాతరేసి మోడీకి పట్టం కట్టారన్న విషయాన్ని మాత్రం ఉద్ధేశ్య పూర్వకంగానే మర్చిపోతున్నారు. మోడీపైన ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకత మొత్తం ఎక్కడ ప్రతిపక్షాలకు పాజిటివ్‌గా మారుతుందో అన్న భయం బిజెపి నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా అన్ని పార్టీల నాయకులందరూ ఎన్ని కుంభకోణాలు చేశారో, వాళ్ళ వైఫల్యాలు ఎన్ని ఉన్నాయో అన్న విషయాలను మరోసారి చర్చకు తీసుకుని వస్తున్నారు. మొదటి రోజుల్లో చెప్పిన గొప్ప గొప్ప మాటలన్నీ మర్చిపోయి నిఖార్సయిన బురద రాజకీయానికి తెరలేపారు బిజెపి నాయకులు. నోట్ల రద్దు గురించి విమర్శించిన అందరినీ అభివృద్ధి నిరోధకులు అనడం, దేశద్రోహులు, నల్లదొంగలు అన్న బ్రాండ్ వేయాలన్న తాపత్రయం తప్పితే సమాధానం చెప్పే సత్తా మోడీతో సహా బిజెపి నాయకులెవ్వరికీ లేనట్టుంది. అందుకే ఎదురుదాడి మంత్రాన్ని జపిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. సర్వే డ్రామా కూడా నవ్వులపాలయింది. మోడీ ప్రధాని అయిన తర్వాత ఇంత పెద్ద సంకట స్థితిని ఏ విషయంలోనూ ఎదుర్కోలేదు. పూర్తి మెజారిటీ ఉండడంతో అంతా కూడా నల్లేరుమీద నడకలా సాగిపోయింది వ్యవహారం. ఈ నోట్ల రద్దు నిర్ణయం మాత్రం ఆల్రెడీ మోడీ మెడకు చుట్టుకున్నట్టుగానే కనిపిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం ముందు వరకూ ఏం చేయాలో తెలియక, ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయిన ప్రతిపక్షపార్టీలన్నీ ఇప్పుడు ఫుల్ ఫాంలోకి వచ్చేశాయి. తన మెడకు చుట్టుకున్న ఈ సమస్యను పరిష్కరించడం మానేసి ఇలాగే ఎదురుదాడి మంత్రంతో సరిపెడతామంటే మాత్రం సోనియా, రాహుల్‌ల స్థాయికి మోడీ ఇమేజ్ కూడా పడిపోవడం ఖాయం. సమాధానంతో సంతృప్తి పర్చడం చేతకానివాడే ఎదురుదాడికి దిగుతాడు. ఎదురుదాడి చేయడం అంటే తమ వైఫల్యాన్ని కొంత వరకూ ఒప్పుకోవడం అన్న అర్థం కూడా వస్తుంది. ఈ సమస్య నుంచీ మోడీ అండ్ కో ఎలా బయటపడతారో చూడాలి మరి.