ఈ ప్రతిష్ఠంభనను మోడియే తొలగించాలి

”సుష్మా స్వరాజ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, వసుంధరా రాజే చేసినవి నేరాలా కాదా అన్నది చర్చించడానికి నేనిక్కడికి రాలేదు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయడం సరైందా కాదా అని చర్చించడానికే వచ్చాను” అని బీజేపీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం ఢిల్లీలో పార్లమెంటు వద్ద మీడియా పాయింట్ లో ఆగ్రహంగా సమాధానం ఇచ్చారు. కేవలం 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ఓటమిని జీర్ణించుకోలేక గందరగోళాన్ని సృష్టిం చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన హేళన చేశారు.

ఇలామొదలైన పార్లమెంటు వానాకాలం సమావేశాలను అర్ధవంతంగా ప్రయోజనకారిగా మార్చగల సామర్ధ్యమైతే ప్రధాని నరేంద్రమోదీకి వుంది..అయితే అందుకు ఆయనకు అనుమతివుందోలేదో తెలియదు.

ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేసి, ఈడీ కేసుల్లో చిక్కుకుని ట్వీటింగ్ లో నిర్విరామంగా తనని సమర్ధించుకుంటూ లండన్‌లో దర్జాగా తిరుగుతున్న లలిత్‌ మోదీకి కనీసం భారత హైకమిషన్‌ ప్రమేయం కూడా లేకుండా వీసా సాయం చేసిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ అధికార దుర్వినియోగంకాదా? ఆమె భర్త, కూతురు ఈ లలిత్‌ మోదీ తరఫున న్యాయవ్యవస్థలో వాదించడం నిజం కాదా? ఈ లలిత్‌ మోదీ ఇమ్మిగ్రేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి, ఆయనతో ఎన్నో ఏళ్లుగా వ్యాపార లావాదేవీలు జరిపిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చేసింది అవినీతి కాదా? మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఉన్న వారే భారీ ఎత్తున మార్కుల కుంభకోణంలో పాలు పంచుకుని వేలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమే కాదు, పలువురు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురికావడాన్ని ఇన్నాళ్లుగా ఉపేక్షించిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ దర్యాప్తు సక్రమంగా జరిగేందుకు వీలుగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఏ బీజేపీ నేతా సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరు.

రాషా్ట్రలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో చర్చించడానికి వీలు లేదు.. అలా అయితే మేము కూడా కాంగ్రెస్‌ పాలిత రాషా్ట్రల ముఖ్యమంత్రుల హయాంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడతాం.. అని బీజేపీ నేతలు బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో వాదిస్తున్నారు. ఆ నేతలు తప్పు చేశారా లేదా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ ఎంపీలే రాషా్ట్రలకు చెందిన అంశాలను ప్రస్తావించినప్పుడు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్వయంగా అనుమతించిన సందర్భాలు వున్నాయి.

బీజేపీ అత్యధిక మెజారిటీ సీట్లు సాధించినంత మాత్రాన ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా చెల్లుతుందా, జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ప్రధాని నరేంద్రమోదీ మొదటిరోజు స్వయంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దకు వెళ్ళి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. కానీ ఆయన కూడా ఈ ఆరోపణల గురించి మాట్లాడేందుకు సుముఖంగా ఉన్నట్లు లేదు. బహుశా ఆయన వీరిని తొలగించాలని అనుకున్నా అలా చేయలేని నిస్సహాయతలో ఉన్నట్లు కూడా చెప్పేవారున్నారు.

ప్రధానమంత్రికి రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ కేవలం ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే స్వేచ్ఛ ఇచ్చింది. మిగతా అంశాలకు సంబంధించి ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థితిలో లేరు.. అనేభావన కూడా ఉన్నత స్ధాయిలో వుంది. ఈ ముగ్గురు నేతలను తొలగించినందువల్ల ప్రధానికి నష్టం లేదు.. అయితే విషయం మరీ ముదిరి ఏదో ఒక చర్యకు సంఘ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాతే ఆయన చర్య తీసుకుంటారన్న అభిప్రాయంకూడా వుంది.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, యువతను, మధ్యతరగతిని పెద్ద ఎత్తున ఆకర్షించిన నరేంద్రమోదీ రాజకీయాలను ప్రక్షాళనం చేస్తారని, అందరికీ సమానావకాశాలు కల్పిస్తారని పలువురు భావించారు. ఆయనకు మొత్తం భారత దేశాన్ని తన వైపునకు తిప్పుకోగలిగినంత మెజారిటీ, ఆమోద యోగ్యత లభించింది. కానీ ఏడాది దాటిపోయిన తర్వాత చూస్తే ఎక్కడా ప్రక్షాళన జరిగిన దాఖలాలు కనపడకపోగా ఉన్న రుగ్మతలను పెంచిపోషిస్తున్న పాతధోరణే కనపడుతోంది. నేరానికీ, అధికారానికీఉన్న అవినాభావ సంబంధం మరింత బలపడుతున్నట్లు కనపడుతోంది.

బీజేపీ నేతలపై వస్తున్న ఆరోపణలు పార్లమెంట్‌ సమావేశాలు వచ్చేసరికి మరింత తీవ్ర తరమయ్యాయి. ప్రభుత్వమే నేరారోపణకు గురైన వారిని కాపాడుతున్నదనే సంకేతాలు పార్లమెంటులో బిజెపి వైఖరిద్వారా స్పష్టమౌతున్నాయి. ఎంతో కాలం ఈ పరిస్థితి కొనసాగడం మంచిది కాదు. మోదీ తనను తాను నిరూపించుకునేందుకు ఎన్నో ప్రజాహితకార్యాలు చేయాల్సి ఉంది. ఆయన ప్రారంభించిన పథకాలు ఊపందుకునేలా కూడా చేయాలి. ఎవరైనా సరే మాటలతోనే ఎక్కువకాలం కాలక్షేపం చేయలేరు. ఈ ప్రతిష్టంభన తొలగిపోవడం మోదీ చేతుల్లోనే ఉంది. అయితే అందుకు ఆయనకు స్వేచ్ఛ వుందో లేదో మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com