ఆరెస్సెస్‌ కథాకళికి కేంద్రం వూతం

ప్రధాని నరేంద్ర మోడీ కొజికోడ్‌లో తమ పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా బహిరంగ సభలో చేసే ప్రసంగం కోసం దేశమంతా ఎదురు చూసింది. ఈ క్రమంలో రెండు రోజులు ప్రధాని కార్యాలయాన్నే కేరళకు తరలించడమంటే ఆరెస్సెస్‌ వ్యూహాలకు కేంద్రం అండదండగా వుండదల్చుకున్నట్టు స్పష్టమవుతుంది. ఆయన ఉరీ ఘటనల తర్వాత బహిరంగ ప్రసంగంచేయడం ఇదే ప్రథమం గనక ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరమే. ఆయన మాట్లాడింది కూడా వూహించినట్టే తీవ్రస్వరంతో వుంది. అయితే అంతకంటే ముఖ్యంగా కేరళలో పినరాయి విజయన్‌ నాయకత్వంలో నూతనంగా అధికారం చేపట్టిన ఎల్‌డిఎప్‌ ప్రభుత్వంపై రాజకీయ దండయాత్ర సంఘ పరివార్‌ ఎజెండాలో కీలక స్థానమాక్రమించింది. అందులో భాగంగానే వారికి అనుకూలమైన తెలుగు పత్రికలతో సహా ప్రత్యేక కథనాలు కమ్యూనిస్టు వ్యతిరేక విశ్లేషణలూ ప్రచురించాయి. ప్రధాని ప్రసంగంలో తను ఆరెస్సెస్‌లో పనిచేసినప్పుడు పెంచుకున్న అనుభవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంలోనూ పరివార్‌ ఎజెండా తొంగిచూసింది.బిజెపిగా తమను ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు దేశాన్నే పాలిస్తున్నామని ప్రకటించారు. ఆయన కంటే ముందు మాట్లాడిన అమిత్‌ షా అయితే మొన్నటి ఎన్నికల్లో కేరళలో బిజెపికి 15శాతం ఓట్టు వచ్చాయంటూ ఇకపై మరింత దూకుడు పెంచుతామన్న సంకేతాలిచ్చారు. ఆరెస్సెస్‌ వారిపై దాడులు జరుగుతున్నాయని పినరాయి విజయన్‌ గ్రామంలోనే ఒక హత్య జరిగిందని ఆరోపించారు. వెంకయ్య నాయుడు తనదైన శైలిలో కమ్యూనిస్టులపై సైద్ధాంతిక దాడి చేశారు.

కేరళలో ఆరెస్సెస్‌ వారిపై దాడులు బిజెపి ప్రచారంలో ఫ్రధానాంశంగా వుంటున్నది. అయితే వాస్తవానికి ఆరెస్సెస్‌ శక్తులే కావాలని అశాంతిని పెంచుతున్నాయని ఎల్‌డిఎప్‌ నేతలు విమర్శిస్తున్నారు.ఈ వారం సిపిఎం అధికార వార పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ కేరళలో ఆరెస్సెస్‌ దాడులపై ఒక సమగ్ర నివేదిక ప్రచురించింది. సి.వి.రవీంద్రన్‌, సురేష్‌బాబు, శశి కుమార్‌, సివి ధనరాజ్‌ తదితరులను హత్య చేశారు. అది కూడా దర్మదామ్‌లో ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఎన్నికల విజయోత్సవ యాత్ర వాహనంపై దాడి చేశారు. ఈ సందర్భంలో సిపిఐ నాయకుడు ఎంఎల్‌ఎ చంద్రశేఖరన్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇదేగాక 14 చోట్ల వామపక్షాల కార్యాలయాలపై దాడులు చేశారని, ఇతరత్రా 210 దాడులు జరిగాయని పీపుల్స్‌ డెమోక్రసీ పేర్కొంది.మీడియాలో బిజెపి నేతల ఆరోపణలకు విస్త్రత ప్రచారం వస్తుంది గాని ఈ నివేదికపైన కూడా నిజానిజాలు వెల్లడిస్తే బావుంటుంది.రాజకీయంగా బిజెపి సమావేశాల్లో రాజకీయ ప్రచారాలు చేసుకోవచ్చు గాని దాన్ని హిందూ ముస్లిం క్రైస్తవ కోణంలోకి మార్చితే అనర్థం …. ఇప్పటి వరకూ మతతత్వ రాజకీయాలకు దూరంగా వుంటున్న కేరళలో ప్రశాంతతను భగం చేసే ప్రయత్నాలు మాత్రం మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com