భాజ‌పా ప్ర‌యోజ‌న‌మే భార‌తీయుల‌ ప్ర‌యోజ‌నం..!

ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌రువాత నుంచీ న‌రేంద్ర మోడీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా, అది దేశ ప్ర‌యోజన అంశంగానే చెప్తూ వ‌స్తున్నారు. ప్ర‌జ‌ల కోస‌మే, ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌నీ, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండాల‌నీ, ప్ర‌జాధ‌నం వృధా త‌గ్గించాలనీ… ప్ర‌తీ నిర్ణ‌యానికీ దాదాపు ఇలాంటి ప్ర‌యోజ‌నాలే ప్రాతిప‌దిక అని చెబుతారు! అంటే, త‌మ ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను అస్స‌లు ఆశించ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల కోసమే అహ‌ర్నిశ‌లూ ఆలోచిస్తోంద‌ని చెప్ప‌డం! ఇదే కోవ‌లో గ‌తంలో తీసుకున్న ఓ నిర్ణ‌యం… కేంద్ర‌ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం. మ‌న‌దేశంలో ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ అనేది భారీ వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడిన ప్ర‌క్రియ కాబట్టి, పార్ల‌మెంటుతోపాటూ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని కూడా క‌లిపి నిర్వ‌హించేస్తే ఖ‌ర్చు చాలా త‌గ్గుతుంద‌ని ప్ర‌ధాని మోడీ చాన్నాళ్ల కింద‌టే ప్ర‌తిపాదించారు. అందుకే, మ‌రో ఏడాదిన్న‌ర‌లో పార్ల‌మెంటుతోపాటు వీలైన‌న్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు వ‌చ్చేలా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కొంత స‌ర్దుబాటు చేసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ఉన్న‌ట్టుండీ ఇప్పుడా ప్ర‌తిపాద‌న‌పై ప్ర‌ధాని వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకుంటే నిర్వ‌హ‌ణ‌కు త‌మ‌కెలాంటి అభ్యంతరం లేద‌ని కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. కానీ, ఇప్పుడు మోడీ సాబ్ ఆలోచ‌న ఏంటంటే… అబ్బే, 2019లో జ‌మిలీ వ‌ద్దు, నీతీ ఆయోగ్ చెప్పిన‌ట్టుగానే 2024లో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసుకుందాం, అప్పుడు వీలైన‌న్ని రాష్ట్రాల‌ను క‌లుపుకుని జ‌మిలి ఎన్నిక‌లు పెడ‌తాం అంటున్నారట‌. ఉన్న‌ట్టుండి మోడీ ఆలోచ‌న ఇలా ఎందుకు మారింద‌నేది అర్థ‌మౌతూనే ఉంది! పెద్ద‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుని ఏడాది గ‌డిచేస‌రికి ప్ర‌జ‌ల్లోని అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతోంది. ఇంకోప‌క్క‌, జీఎస్టీతోపాటు ఇత‌ర ధ‌ర‌ల పోటుతో సామాన్యుడు ఆగ్ర‌హంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో పార్ల‌మెంటుతోపాటు, అసెంబ్లీల‌కూ ఎన్నిక‌ల‌కు వెళ్లార‌నే అనుకోండి… తేడా కొడితే మొత్తం తుడుచుకుపోతుంది! నూటికి నూరు శాతం ఇదే భ‌యం భాజ‌పా పెద్ద‌ల‌కు ప‌ట్టుకుంది. అందుకే, ఇప్పుడు రాష్ట్రాల‌తోపాటుగా లోక్ స‌భ ఎన్నిక‌లు అనే ఆలోచ‌న విర‌మించుకుంటున్నార‌ట‌!

మ‌రి, ఈ క్ర‌మంలో దేశ ప్ర‌యోజ‌నాలు ఏమ‌య్యాయి..? ఎన్నిక‌ల ప్ర‌క్రియ వ‌ల్ల చాలా ఖ‌ర్చు, జమిలి ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హిస్తే ప్ర‌జాధ‌నం దుర్వినియోగం త‌గ్గుతుంద‌ని గ‌తంలో ప‌లికిన హిత వ‌చ‌నాలు ఎటుపోతున్నాయి..? భాజ‌పా మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుందో రాదో అనేదే ప్ర‌ధాని ప్రాధ‌మ్యంగా మారుతోంది. ఆ పార్టీపై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త వేడి త‌గిలేస‌రికి నిర్ణ‌యాలు మారిపోతున్నాయి. మ‌రి, ‘2019లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌ద్దు’ అనే ఈ అంశానికి కూడా దేశ ప్ర‌యోజ‌నాలుగానీ, ప్ర‌జా ప్ర‌యోజ‌నాలుగానీ ఏవైనా అంట‌గ‌డ‌తారో లేదో చూడాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.