ప్ర‌మాదం వార్త‌లో కూడా రాజ‌కీయ క‌క్కుర్తే..!

విజ‌య‌వాడ‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కృష్ణా న‌దిలో విహార‌యాత్ర‌కి బ‌య‌లుదేరిన బోటు త‌ల్ల‌కిందులైంది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత‌మంది గ‌ల్లంత‌య్యారు. మ‌రికొంద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. డ‌బ్బు కక్కుర్తితో అనుమ‌తి లేని బోటు న‌డిపిన యాజ‌మానుల త‌ప్పు ఇది. ఆ ప్రాంతంలో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారుల నిర్ల‌క్ష్యం ఇది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికంగా ఉన్న జాల‌ర్లు స్పందించారు. ఒడ్డున ఉన్న‌వారు నాలుగు బోట్లేసుకుని కొంత‌మందిని ర‌క్షించారు. బోటింగ్ సిబ్బంది కూడా కొంత‌మందిని కాపాడింది. ఏదేమైనా ఇదో ఘోర ప్ర‌మాదం. దీనికి కార‌ణం అడుగ‌డుగునా క‌నిపిస్తున్న నిర్ల‌క్ష్యం. భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించకుండా ప‌డ‌వ న‌డ‌పం ప్ర‌మాదం. అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయ‌ని గుర్తించ‌క‌పోవ‌డం అధికారుల అప్ర‌మ‌త్త‌త లోపం. ఇలాంటి సంద‌ర్భంలో ఒక బాధ్య‌త‌గ‌ల మీడియాగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన కోణం ఇది. కానీ, ఇక్క‌డ కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ఆలోచిస్తే ఎలా..? సాక్షిలో వ‌చ్చిన క‌థ‌నం ఇలానే ఉంది.

‘తక్షణమే స్పందించిన వైకాపా నేతలు’ అంటూ ఓ క‌థ‌నం రాశారు. దాని సారాంశం ఏంటంటే.. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వైకాపా నేత‌లు స్పందించారట! ప్ర‌మాద స్థ‌లానికి ముందుగా వారే చేరుకున్నార‌ట‌. వారు వ‌చ్చిన 45 నిమిషాల త‌రువాత పోలీసులు వ‌చ్చార‌ట‌. అధికార యంత్రాంగం ప‌త్తా లేకుండా పోయింద‌ని రాశారు. వైకాపా నేత‌లు పార్థ సార‌ధి, జోగు ర‌మేష్‌, ఉద‌య‌భానుల‌తోపాటు కొంత‌మంది అనుచ‌రులు ప‌ది నిమిషాల్లోనే ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల స‌మ‌న్వ‌యంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ఆ త‌రువాత పోలీసులు వ‌చ్చి, స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్న వైకాపా నేత‌ల‌పై దౌర్జ‌న్యం చేశార‌నీ, వారిని అడ్డుకున్నార‌ని రాశారు. పోలీసులు వెంట‌నే రాక‌పోవ‌డంతో ‘‘బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు’’గా (ఇలానే రాశారు, అందుకే డబుల్ కోట్స్ పెట్టింది) తాము స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌నీ, త‌మ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే పోలీసులు దౌర్జ‌న్యం చేశార‌నీ, ప‌క్కన నిల‌బ‌డి స‌హాయ‌క చ‌ర్య‌లు పర్య‌వేక్షిస్తామ‌ని చెప్పినా పోలీసులు అనుమ‌తించ‌లేద‌ని నేత‌లు వాపోయిన‌ట్టు రాశారు.

ఏమండీ.. ఒక ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు సాటి మ‌నిషికి సాయం చేయ‌డానికి మాన‌వ‌త్వం చాలు క‌దా! దానికి ‘బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష నేత‌లై’ ఉండాలా..? ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు కాకపోతే ఇలాంటి స‌మయంలో సాయం చేయ‌రా..? ఆ క‌థ‌నం చ‌దివాక ఇలానే అనిపిస్తోంది. ఆ క‌థ‌నంలో ఎక్క‌డా మాన‌వత్వం అనే మాట లేదే..! ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికంగా ఉన్న‌వారంతా స్పందించారు. వీలైనంతమందిని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. ఇది వాస్తవంగా జరిగింది. దీన్ని ఓ మామూలు ప్ర‌మాద ఘ‌ట‌న‌గా రిపోర్టింగ్ చేయాల్సింది పోయి.. దీనికి కూడా రాజ‌కీయ రంగు పూసి రాసేస్తే ఏమ‌నుకోవాలి..? పోలీసులు 45 నిమిషాలు ఆల‌స్యంగా వ‌చ్చారు, వైకాపా నేత‌లు వెంట‌నే స్పందించారు… ఈ రెండు విష‌యాల‌ను తిప్పితిప్పి ఓ మూడుసార్లు చెప్పారు. వైకాపా నేత‌ల్ని పోలీసులు అడ్డుకున్నారని కూడా ఓ రెండుసార్లు చెప్పారు. ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు, ఆ ఘ‌ట‌నా స్థలానికి పేరున్న నాయ‌కులు త‌మ అనుచ‌రుల‌తో వెంట‌నే వెళ్లిపోతే, వారి భ‌ద్ర‌త కూడా పోలీసుల‌కు కొత్త స‌మ‌స్య అవుతుందా కాదా..? అయినా, ప్ర‌మాద వార్త‌ల్లో కూడా ఈ పొలిటిక‌ల్ క్రెడిట్ క‌క్కూర్తి ఏంటో అర్థం కావ‌డం లేదు. వైకాపా నేత‌లు సాయం చేశారు.. వారిని అంద‌రం మెచ్చుకుందాం. కానీ, వైకాపా నేత‌లు కాబ‌ట్టే సాయం చేశార‌న్న‌ట్టుగా రాసే రాత‌ల వ‌ల్ల‌.. వారు చేసిన సాయంలో కూడా రాజ‌కీయ కోణం ఉందా అని శంకించాల్సి వ‌స్తోంది. ఇదేం జ‌ర్న‌లిజం..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com