మోడీ ఎత్తు ఫలిస్తుందేమో కానీ…

పాక్ వైఖరి కారణంగా కాశ్మీర్ సమస్య భారత్ కి క్యాన్సర్ వ్యాధిలాగ మారిపోయింది. గత 7దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు దానికి తాత్కాలిక ఉపశమనం చేయగలుగుతున్నాయే తప్ప శాశ్విత పరిష్కారం కనుగొనలేకపోతున్నాయి. అందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.కాశ్మీర్ సమస్యని నెహ్రు ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో పెట్టడం 2. పాక్ వైఖరి.

ఈ విషయంలో పాక్ వైఖరి మారనంత వరకు మొదటి సమస్య పరిష్కారం కాదు. మొదటి సమస్య పరిష్కారం అయ్యే వరకు పాక్ వైఖరి మారదు. అంటే పెళ్ళయితే పిచ్చి కుదురుతుంది…పిచ్చి కుదిరితేనే పెళ్ళవుతుందన్నట్లన్న మాట!

ప్రధాని మోడీ కూడా తన వంతుగా కాశ్మీర్ సమస్యకి శాశ్విత పరిష్కారం కోసం సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నారు. కానీ దానిలో కాశ్మీర్ సమస్యతో అసలు ఎటువంటి సంబందమూ లేని బలూచ్ ప్రజలు ప్రాణాలు కోల్పోవలసిరావడమే మనసుని చాలా కలచివేస్తోంది.

కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమకారులకి మద్దతుగా మాట్లాడారు. అక్కడ జరుగుతున్న మానవహక్కుల గురించి మాట్లాడారు. పాక్ ప్రభుత్వానికి భయపడి విదేశాలలో తలదాచుకొంటున్న బలూచ్ ఉద్యమకారులకి భారత్ లో ఆశ్రయం కల్పించడానికి సిద్దపడ్డారు. బలూచ్ ప్రజలు తమ కష్టనష్టాలని, కన్నీళ్ళని ప్రపంచదేశాల ప్రజలతో పంచుకొనేందుకు డిల్లీలో ఆకాశవాణి ద్వారా ఒక మల్టీ మీడియా వెబ్ సైట్ ని ఏర్పాటు చేశారు. బలూచ్ లోని సామాన్య ప్రజలు కూడా తమ సమస్యలని అందరితో పంచుకొనేందుకు ఒక మొబైల్ యాప్ కూడా ఏర్పాటు చేశారు. అందుకు బలూచ్ ప్రజలు, వేర్పాటువాదులు కూడా చాలా సంతోషిస్తున్నారు. కానీ తమ దేశ అంతర్గత వ్యవహారాలలో భారత్ వేలు పెడుతున్నందుకు భారత్ పై పాక్ ప్రభుత్వం మండిపడుతోంది. కాశ్మీర్ విషయంలో భారత్ అనుభవిస్తున్న నొప్పి, బాధని ఇప్పుడు పాకిస్తాన్ కి బాగానే అర్ధం అయ్యుండవచ్చు.

అపుడు భారత్ ఆశించిన విధంగా పాక్ స్పందించి ఉంటే మోడీ ప్రభుత్వ వ్యూహం అద్భుతమని అందరూ ప్రశంసించేవారు. కానీ ఉగ్రవాదాన్నే నమ్ముకొని బ్రతుకుతున్న పాకిస్తాన్ తను సాగుతున్న పద్దతిలోనే స్పందిస్తోంది.

అక్కడికి పాక్ సైనికులని పంపించి, సామాన్య ప్రజలపై చాలా పాశవికంగా యాసిడ్ దాడులు చేయించి చాలా క్రూరంగా హింసించి హత్యలు చేయిస్తోంది. బలూచ్ లో నిత్యం డజన్లమంది ప్రజలు మాయం అయిపోతుంటారు. కొన్ని రోజుల తరువాత వారి శవాలు రోడ్లపై కనిపిస్తుంటాయి. ఎప్పుడు ఎవరికీ ఆయువు మూడుతుందో తెలియక బలూచ్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారని బలూచ్ ఉద్యమకారులే స్వయంగా భారత్ కి తెలియజేసి సహాయం కోరుతున్నారు. భారత్-పాక్ మధ్య కాశ్మీర్ అంశంపై జరుగుతున్న గొడవలకి వాటితో ఏ సంబంధం లేని బలూచ్ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారన్న మాట! కానీ భారత్ వెళ్ళి వారిని ఆదుకో(లే)దు!

కాశ్మీర్ వేర్పాటువాదులని పాకిస్తాన్ ఏవిధంగా స్వాతంత్ర సమరయోధులుగా వర్ణిస్తోందో అదేవిధంగా భారత్ కూడా బలూచ్ వేర్పాటువాదులని స్వాతంత్ర సమరయోధులుగా వర్ణిస్తోందిప్పుడు. కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లే, భారత్ కూడా బలూచ్ వేర్పాటువాదులకి అండగా నిలబడేందుకు సిద్దపడుతోంది. అంటే పాక్ చేస్తున్న తప్పునే భారత్ కూడా చేస్తోందనుకోవాలేమో?

బలూచ్ ప్రజల కోసం భారత్ మల్టీ మీడియా వెబ్ సైట్, మొబైల్ యాప్ ని ఏర్పాటు చేసింది కనుక పాకిస్తాన్ కూడా కాశ్మీర్ వేర్పాటువాదుల కోసం ఏర్పాటు చేయవచ్చు. ధూర్తదేశమైన పాకిస్తాన్ కి అడ్డుకట్టవేసి కాశ్మీర్ సమస్యకి శాశ్విత పరిష్కారం కోసం మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ వ్యూహంతో ఆశించిన ఫలితం వస్తుందో లేదో తెలియదు. దానికి బలూచ్ లో ఎంతమంది మహిళలు, పసిపిల్లలు బలవుతారో తెలియదు. ఇంత జరిగిన తరువాతైన కాశ్మీర్, బలూచ్ ప్రజల సమస్యలకి శాశ్విత పరిష్కారం లబిస్తే సంతోషమే. లేకుంటే…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com