మోదీ గోల్డ్ స్కీమ్ కి వెంకన్నే దొరికాడా ?

ఫోకస్

హిందూమతానికి రక్షరేకులా ఉండాల్సిన బిజెపీ ప్రభుత్వం, హిందూ ఆలయాల్లోని బంగారంపై కన్నేసిందా ? దేశాభివృద్ధి పేరిట ప్రధాని మోదీ ప్రకటించిన `స్వర్ణ నగదీకరణ’ పథకం పేరిట, తిరుమల వెంకన్న కానుకులను కరిగించబోతున్నారా? ముంబయి, కేరళలోని ఆలయాలను పట్టించుకోకుండా తిరుమలపైనే కన్నెందుకు వేసినట్లు ? మోదీ గోల్డ్ స్కీమ్ కి ముందుగా వెంకన్నే దొరికాడా ?? టిడిపీ ప్రభుత్వ మెతక వైఖరికి కారణాలేమిటి ?

తిరుమల…ఇది కలియుగ వైకుంఠం. సాక్షాత్తు మహావిష్ణువే వైకుంఠాన్ని వదిలి కలియుగ వాసులను కాపాడటం కోసం వేంకటేశ్వరునిగా తిరుమల గిరుల్లో వెలిశాడన్నది భక్తుల నమ్మకం. భక్తుల కోర్కెలు తీర్చే కోనేటిరాయుడి దివ్యధామం తిరుమల. ఆగర్భశ్రీమంతుడు, అతి సామాన్యుడు తమ శక్తానుసారంగా దేవదేవునికి బంగారు కానుకులను సమర్పించుకుంటారు. శ్రీవారి హుండీ దర్శనమే పరమ పవిత్రం. అందుకే, వడ్డీ కాసుల వాని వద్ద ఏటా టన్నుల కొద్దీ బంగారు పేరుకుపోతుంటుంది. శ్రీవారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా మారింది. ఈ కారణంగానే మోదీ స్వర్ణ పథకం అమలుకు శ్రీవారి ఆలయంమీదనే తొలిచూపు పడింది. ఒత్తిళ్లకు టిటిడీ ప్రభుత్వం లొంగిపోతున్నది.

దేశంలో 20వేల టన్నుల బంగారం నిల్వలు వృధాగా పడిఉన్నాయనీ, వీటిని ఉభయతారకం మార్చాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం స్వర్ణ నగదీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి మోదీ ఈ గోల్డ్ స్కీమ్ ని అత్యంత ఘనంగా ప్రారంభించినప్పటికీ, గోల్డ్ నగదీకరణ పథకానికి ఆశిచినంత స్పందన రాలేదు. దీంతో ప్రభుత్వ దృష్టి ఎక్కువగా బంగారం నిల్వలున్న దేవాలయాలమీద పడింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల-తిరుపతి దేవస్థానంమీద `మొదటి’ చూపు పడింది.

హిందూ ఆలయాలకు భక్తులు ఇచ్చిన బంగారు కానుకలను కరగించి శుద్ధబంగారంగా మార్చి దాన్ని కొత్త పథకం క్రింద ఉంచితే ఆలయాలకు 2.5 శాతం వడ్డీవస్తుంది. ఇదీ పథకం లక్ష్యం. ఇప్పటివరకు ఆలయంలోని స్వర్ణ కానుకలను బ్యాంకుల్లో ఉంచితే ఒక్క శాతం వడ్డీ మాత్రమే దక్కుతున్నది. కొత్త పథకంలో డిపాజిట్ చేస్తే మరో ఒకటిన్నర శాతం వడ్డీ అదనంగా వస్తుంది. వడ్డీ పరంగా చూస్తే లాభసాటిగానే ఉండవచ్చు. కానీ, భక్తుల కానుకలను కరిగిస్తామనడమే ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ ఈ పథకం క్రింద బంగారాన్ని కొదవపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకూలంగానే స్పందించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ పథకం బేషుగ్గా ఉన్నదంటూ కితాబు ఇచ్చేశారు. ఈ మేరకు టిటిడీకి ఆదేశాలు కూడా వెళ్ళాయి.

ఇచ్చేది ఎవరు ? పుచ్చుకునేది ఎవరు ?

`ఆపద మొక్కులవాడా…గోవిందా…గోవిందా’ – అంటూ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఇచ్చే స్వర్ణ కానుకలను కరగించి శుద్ధబంగారంగా మార్చి ఈ పథకం క్రింద బ్యాంకుల్లో నిలవ ఉంచుతారన్న విషయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కంటే వడ్డీ ఎక్కువ వస్తున్నమాట నిజమే కావచ్చు, కానీ శుద్దీకరణ పేరిట కరిగించడమే మనస్సు చివుక్కుమనిపిస్తోంది. నిజానికి ఈ పథకానికి పెద్దగా స్పందన ప్రజల వద్ద నుంచి రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. వడ్డీ ఎక్కువ వస్తుందని చెబుతున్నా, ప్రజలు తమవద్ద ఉన్న నగలను ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. తాము ఇష్టపడి చేయించుకున్న నగలను శుద్దీకరణ పేరిట కరిగించడం వారికి నచ్చడంలేదు. ఇలా ప్రజలవద్ద బెడిసికొట్టిన పథకాన్ని, ఆలయాల దగ్గర విజం సాధించేలా చేయాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ఆలయాల్లోని బంగారంపై కన్నేసింది. మరీ ముఖ్యంగా టన్నులకొద్ది బంగారు నిల్వలున్న తిరుమలపై ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఒత్తిడి చేయగానే అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , ఆయన సహచర మంత్రులు తలలూచారు. ఫలితంగా తిరుమలేశుని బంగారం ఈ పథకం క్రింద డిపాజిట్ చేసేందుకు పావులు చకచకా కదులుతున్నాయి. అయితే తామెంతో భక్తి భావంతో ఇచ్చిన కానుకలను ఇలా కరిగించడం భక్తుల్లో మాత్రం అసహనం రేపుతోంది. ఇచ్చేదెవరు? పుచ్చుకునేదెవరు? అంటూ భక్తులు నిలదీస్తున్నారు. ఈ పథకం వల్ల టిటిడీకి వడ్డీ రేటు పెరగవచ్చు, అలాగే, దేశ ప్రయోజనాలను భారత ప్రభుత్వం తీర్చుకోవచ్చు, కానీ మధ్యలో భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. దీనికి తోడు రాజకీయనాయకుల జోక్యం చేసుకోవడం సైతం భక్తుల్లో ఎన్నో అనుమానపు నీడలు పరుచుకుంటున్నాయి. మోదీ చెప్పిన మాటలకు ప్రభుత్వం బుట్టలోపడిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబయి వినాయక ఆలయం

ముంబయిలో రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ సిద్ధివినాయక ఆలయం ఉంది. అక్కడ కూడా భక్తులు ఇచ్చిన బంగారు కానుకలు టన్నుల్లో పేరుకుపోయింది. ఈ ఆలయంలోని బంగారు నిల్వలను కొత్త పథకం క్రిందకు రప్పించాలని కేంద్రం భావించినా, పప్పులుడకలేదు. శుద్దీకరణ పేరిట బంగారు నగలను కరిగిస్తే తూకం తగ్గుతుందనీ, పైగా కానుకలను కరిగించడం తమకు ఇష్టంలేదని ఆలయ అధికారులు కరాఖండిగా చెప్పేశారు. ఆ పని మనవాళ్లు చేయలేకపోతున్నారు. ఫలితంగా వెంకన్నకు ఇచ్చిన కానుకలను కరిగించబోతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయబోతున్నారు.

అనంత పద్మనాభ స్వామి ఆలయం

కేరళలో కూడా మోదీ ట్రిక్కులు ఫలించేలా లేవు. అక్కడ ఎంతో పురాతనమైన అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో టన్నుల కొద్దీ బంగారం నిల్వలున్నాయి. అదంతా ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది. అయితే తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను నగదీకరణ పథకం క్రింద ఇవ్వడానికి ఈ ఆలయం సుముఖంగా లేదు.

బాబాలు, స్వామీజీల ఆశ్రమాలు

ప్రముఖ ఆలయాల్లోనే కాకుండా బంగారం నిల్వలు మనదేశంలోని పలువురు బాబాలు, స్వామీజీల ఆశ్రమాల్లో నిరుపయోగంగా పడున్నాయి. అయితే వారెవరూ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదీకరణ పథకం పట్ల ఆసక్తి చూపడంలేదు. పుట్టపర్తిలోని సత్యసాయి సన్నిధానంలో లెక్కకు మించిన బంగారం ఉన్నట్లు తేలింది. అలాగే చిన్నాచితకా స్వామీజీల దగ్గర ఉన్న బంగారం తక్కువేమీకాదు. ఇదంతా కూడా ఈ పథకం క్రింద జాతీయ బ్యాంకుల్లో చేరితే, విదేశీ మారకంలో `దేశం విలువ’ గణనీయంగా పెరుగుతుంది. దీంతో బంగారం దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఫలితంగా దేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది. మోదీ ఆలోచన మంచిదే. హిందూమతానికి చెందిన ఆలయాల సంగతే కాకుండా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల విషయంలో కూడా ఇదే చొరవ చూపిస్తే అంతగా విమర్శలు వచ్చి ఉండేవికావు. దేశప్రయోజనాల దృష్ట్యా చర్యలు తీసుకునేటప్పుడు సమదృష్టి ఉండాలి. అలా కాకుండా కేవలం హిందూ ఆలయాలమీదనే దృష్టి సారించడం, అందునా ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంమీద కన్నేయడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. దీనికి తోడు కేంద్రం `తానా’ అంటే రాష్ట్రం `తందానా’ అనే రకంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా మారింది. ప్రధాని మోదీతో కొత్త రాష్ట్రానికి అవసరాలు చాలానే ఉంటే ఉండవచ్చు. కానీ ఇంత తొందరపాటు తగదు. అన్నింటికి మించి స్వామివారి కానుకలను కరిగించాలనడం భక్తుల మనోభావాలపై దెబ్బతీస్తోంది. పథకంపై క్లారిటీ లేకుండా పాలకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. వెంకన్న భక్తులారా… తస్మాత్ జాగ్రత్త.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close