ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్రి ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అంశం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కాల్పుల విరమణ వరకూ ప్రతి అంశంపై ప్రజలకు వివరించనున్నారు. పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టాలని భారత్ నిర్ణయించుకుని ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. ఉగ్రవాదలను టార్గెట్ చేస్తే పాకిస్తాన్ మాత్రం వారి కోసం రంగంలోకి దిగింది. ఇక్కడే పాకిస్తాన్ ఉగ్రదేశమన్న సంకేతాలను భారత్ బలంగా పంపింది.
ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం.. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లతో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్ టర్కీ డ్రోన్లు, చైనా మిస్సైళ్లతో భారత్ పై దాడి చేసింది. ప్రతీ రోజూ చీకటి పడగానే అదే పని చేసింది. కానీ ప్రతి డ్రోన్, మిస్సైల్‌ను భారత్ నిర్వీర్యం చేసింది. కానీ సరిహద్దుల్లో చేసిన చేసిన కాల్పుల కారణంగా పలువుర్ని భారత్ కోల్పోయింది. పాకిస్తాన్ కు చెందిన వంద మంది ఉగ్రవాదులతో పాటు నలభై మంది వరకూ సైనికులు చనిపోయారు.
ఇప్పుడు భారత్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఉంది. ఈ క్రమంలో మోదీ అసలేం జరిగిందో.. పాకిస్తాన్ ను ఎలా ఓడించామన్న విషయాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. పీవోకేను స్వాధీనం చేసుకునే విషయంలో తమ నిబద్దతను ఆయన ప్రజలకు చెప్పే అవకాశం ఉంది.